ఈ చిత్రం కోసం సినారె వ్రాసిన తోటలో నారాజు మామ మహదేవన్ కూర్చిన చక్కని బాణీ కల్యాణి రాగం లో ఘంటసాల, పి.సుశీల ఆలపించిన మధుర యుగళ గీతం. యవ్వనవతియైన యువతిని 'ఎలనాగ' (యౌవనవతి) అన్న చక్కని పదంతో అభివర్ణించారు. అలాగే 'పాటలాధర రాగభావనలు' అన్నారు. పాటల వర్ణం అంటే గులాబి రంగు. గులాబిరంగులోని అధరాల (పెదవుల) రాగాలు పలికే భావనలను చూశాను. ఎంత చక్కని కవి వర్ణన. సినారె ఈ పాటలో. మరొక విషయం ఏమిటంటే పాటను ఎక్కువ భాగం అంత్యానుప్రాసలో వాసారు. అంటే ఇంచుమించు ప్రతి రెండు పంక్తులకు ఆఖరి అక్షరం ఒకటే అవుతుంది. ఉదా. నాడు-నేడు; పారిజాతాలు-రమ్యగీతాలు; ఇలా చాల చోట్ల కనిపిస్తుంది. ఇక ఆస్వాదించండి ఈ గీతాన్ని.
Thanks to TeluguOne for posting the video to You Tube
చిత్రం:
ఏకవీర (1969)
రచన:
సి.నారాయణ రెడ్డి
సంగీతం:
కె.వి.మహదేవన్
గానం:
ఘంటసాల, పి.సుశీల
ప:
సు:
తోటలో నారాజు తొంగి
చూచెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
| తోటలో |
చ:
సు:
నవ్వులా అవి? …... కావు!
నవ్వులా అవి?
కావు! నవ పారిజాతాలు
నవ్వులా అవి?
కావు! నవ పారిజాతాలు
రవ్వంత సడి లేని రస రమ్య గీతాలు
| రవ్వంత |
ఆ రాజు ఈ రోజు అరుదెంచునా?
| ఆ రాజు |
అపరంజి కలలన్ని చివురించునా?
| తోటలో |
చ:
ఘం:
చాటుగా పొదరింటి మాటుగా వున్నాను
| చాటుగా |
పాటలాధర రాగభావనలు కన్నాను
ఎలనాగ నయనాల కమలాలో దాగి
| ఎలనాగ |
ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను
| ఎదలోన |
ఆ పాట నాలో తీయగ మ్రోగనీ
| ఆ పాట |
అనురాగ మధు ధారయై సాగనీ
ఊహూహు…ఊ..హూ..
సు:
తోటలో నారాజు తొంగి చూచెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడూ..ఊ..ఊ..
కృతజ్ఞతలు: సమాచారాన్ని పొందుపరచిన వికి పీడియాకు, వీడియో లభ్యం చేసిన తెలుగు వన్ కు మరియు యూ ట్యూబ్ వారికి ధన్యవాదములు.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com