శ్రీ చింతగుంట సుబ్బారావు
గారు 1932 ఏప్రిల్ 5 న గుంటూరులో జన్మించారు. ఆయన ఆంగ్ల సాహిత్యంలో
మాస్టర్ పట్టా పుచ్చుకున్నారు. ఆంగ్లమే కాక తెలుగు, సంస్కృతం మరియు హిందీ
భాషలలో పండితులు. చీరాల V.R.S. మరియు Y.R.N. కళాశాలలలో
ఆంగ్ల ప్రాసంగికులుగా పనిచేసారు. తెలుగులో 18, ఆంగ్లంలో 10, సంస్కృతంలో 6
మరియు హిందీలో ఒకటి గ్రంథాలు రచించారు. పలు సంస్కృత శ్లోకాలకు తెలుగు
భాష్యాలను, అన్నమాచార్య కీర్తనలను ఆంగ్ల, హిందీ భాషలలోకి అనువదించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని లలిత సంగీత విశారద బిరుదుతో సత్కరించింది.
నీ కొండకు నీవే రప్పించుకో అన్న లలితగీతం వీరు రచించిన 'అమృతవర్షిణి' అనే
పాటల సంకలనం లోనిది.ఈ పాటను మాస్టారి అనుంగు శిష్యులు, తిరుమల తిరుపతి
దేవస్థానం ఉద్యోగి అయిన శ్రీ కె.ఎస్.వీర రాఘవులు గారు 1968-69 మధ్య విజయవాడ
రేడియోలో పాడారు. ఈ పాటను ఆయన ఒక కచేరీలో పాడగా మాస్టారికి ఆ పాట నచ్చి,
ఆపాట రచయిత అయిన సుబ్బారావు గారి వివరాలు తెలుసుకుని తదుపరి పరిచయంకూడ
చేసుకున్నారట. ఒకసారి మాస్టారు అస్వస్థులైనపుడు ఈ పాటను రికార్డు
చేయిస్తానని మొక్కుకున్నారట. అలాగే స్వస్థత పొందిన తరువాత గ్రామఫోను
కంపెనీలో దీనిని రికార్డు చేసి విడుదల చేశారు. ఉద్యోగరీత్యా రచయిత,
అనారోగ్య కారణంగా మాస్టారు తిరుపతికి వెళ్ళలేని వీరిరువురి మనోభావాల
ప్రతిబింబమైన ఈ పాటను "మన ఇరువురి మొక్కుబడికి సంబంధించిన పాట యిది" అని
మాస్టారు సుబ్బారావు గారితో అన్నారట. ఈ సంఘటన జరిగిన మరునాడే మాస్టారు
నల్గొండలోని శ్రీ భక్తాంజనేయ దేవాలయంలో జరిగిన అర్చక మహాసభలకు ముఖ్య
అతిథిగా వెళ్ళడం జరిగిందట. ఆ సభలో మాస్టారు 'ఆధ్యాత్మిక తత్వం, అర్చకుల
విధి నిర్వహణ, దేవాలయ ప్రాశస్త్యం' అనే అంశాలపై సంభాషిస్తూ భక్త శ్రోతల
కోరికపై "ఇదిగో నిన్ననే రికార్డు చేసిన పాట" అని నీ కొండకు నీవే రప్పించుకో
పాటను మధురంగా గానంచేశారట.
ఘంటసాల యిష్టదైవం ఆ కొండలపై నెలకొన్న కోనేటి రాయడు. అతనే వేంకటేశ్వరుడు. ఆస్వామి పేరును తన పేరులో నిలుపుకున్న ఘంటసాల వేంకటేశ్వర రావు. ఆ ఏడుకొండలవానిపై మాస్టారు ఎన్నో భక్తి గీతాలు పాడారు. ఆ వడ్డికాసుల వాడు మనను కొండకు రప్పించి మన ఆపదమొక్కుల ముడుపులు స్వీకరించి ఆశీర్వదిస్తాడు.సి.సుబ్బారావు రచించిన నీ కొండకు నీవే రప్పించుకో అనే ఈ చక్కని భక్తి గీతాన్ని మాస్టారు చక్రవాక రాగంలో స్వరకల్పన చేసి గానం చేసారు. విని ఆనందించండి.
మూలం:
ప్రైవేట్ ఆల్బమ్
రచన:
సి. సుబ్బారావు
సంగీతం:
ఘంటసాల
గానం:
ఘంటసాల
సాకీ:
నీ కొండకు నీవే…
రప్పించుకో…ఓ..ఓ..
ఆపదమొక్కులు మా...చే యిప్పించుకో
పల్లవి:
నీకొండకు నీవే రప్పించుకో
ఆపదమొక్కులు మాచే యిప్పించుకో
ఓ తిరుపతి వేంకటేశా..ఆ..
ఓ తిరుపతి వేంకటేశ ఓ! శ్రీనివాసా
నీ విచ్చిన యీ జన్మకు విలువ కట్టుకో
నీకొండకు నీవే రప్పించుకో
ఆపదమొక్కులు మాచే యిప్పించుకో
నీకొండకు నీవే రప్పించుకో
చరణం:
కొండంత సంసారం మోయలేని మానవులం
ఏడు కొండల నెక్కి రమ్మంటే రాలేము
సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం
స్వర్గానికి నిచ్చెనలు వేయలేము
నీకొండకు నీవే రప్పించుకో
ఆపదమొక్కులు మాచే యిప్పించుకో
నీకొండకు నీవే రప్పించుకో
చరణం:
మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై
మా లోపలి దివ్యజ్యోతి మసకేసి పోతున్నది
అహంకార మణగించి మమకారం తొలగించి
చేయూత నిచ్చి మమ్ము చేరదీసుకో
నీకొండకు నీవే రప్పించుకో
ఆపదమొక్కులు మాచే యిప్పించుకో
నీకొండకు నీవే రప్పించుకో
నీకొండకు నీ...వే రప్పించుకో
కృతజ్ఞతలు: రచయిత వివరాలు శ్రీ పురుషోత్తమాచార్యులు రచించిన మన ఘంటసాల సంగీత వైభవం నుంచి గ్రహించాను.
Super song. Tirumala Swami vari darshan delay inappudalla ee song padukuntamu. Darshan anta reserve chesukoni vellaleni paristutulu vastai kondariki. Sorry to hear the sad news. May his soul rest in peace. May God be with the family members. Regards Grksubbarao.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com
Super song. Tirumala Swami vari darshan delay inappudalla ee song padukuntamu. Darshan anta reserve chesukoni vellaleni paristutulu vastai kondariki. Sorry to hear the sad news. May his soul rest in peace. May God be with the family members. Regards Grksubbarao.
రిప్లయితొలగించండి🙏🙏🙏🙏 గోవిందా గోవిందా
రిప్లయితొలగించండి