
ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే వెండి తెరపై నాట్య తారగా అడుగుపెట్టి అంతవరకూ చిన్న పాత్రలు వేసిన తమిళ మాతృభాషా నటి ఇ.వి.సరోజ తొలిసారిగా కథానాయిక పాత్రలో నటించిన చిత్రమిది. ఇక పాటలకు వస్తే అంతా సురసాలూరించే స్వర రాజేశ్వరం. అన్నీ చక్కని పాటలే. మొత్తం ఇద్దరు మిత్రులు చిత్రానికి తొమ్మిది పాటలు వ్రాసారు గేయ రచయితలు. అందులో ప్రముఖమైనవి, ఘంటసాల, సుశీల గార్లు పాడినవి - పాడవేల రాధికా, ఓహో ఓహో నిన్నే కోరెగా (శ్రీశ్రీ); హలో హలో ఓ అమ్మాయి, ఈ ముసిముసి నవ్వుల (ఆరుద్ర); ఖుషీ ఖుషీగా నవ్వుతూ (దాశరధి). భద్రాచల రామదాస కీర్తనకు పేరడీ వంటి కొసరాజు గారి రచించిన మాధవపెద్ది సత్యం గారు పాడిన "శ్రీరామ నీ నామమెంతో రుచిరా", దానికి శ్రీ రమణారెడ్డి గారి అభినయం ఎవరు మరచిపోగలరు. నటీనటుల విషయానికొస్తే అంతవరకూ చిత్రసీమలో బాలనటిగా ఎదుగుతూ తొలిసారి హీరో చెల్లెలి పాత్ర పోషించిన శ్రీమతి శారద నటన ప్రశంశనీయం. తదుపరి కాలంలో ముమ్మారు ఉత్తమ నటిగా "ఊర్వశి" జాతీయ అవార్డు లభించిన ఒకే ఒక తెలుగు నటి ఊర్వశి శారద. అన్నా చెల్లెళ్ళ ఆప్యాయతలు, అభిమానాలు తెలియచెప్పే చక్కని కుటుంబ చిత్రం ఇద్దరు మిత్రులు.
కృతజ్ఞతలు: చిమట మ్యూజిక్, పాడుతా తీయగా చల్లగా, యు ట్యూబ్ మరియు ఓల్డ్ తెలుగు సాంగ్స్ డేటాబేస్ .