1948 లో విడుదల అయిన "ద్రోహి" చిత్రం సంగీత దర్శకునిగా శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు గారి తొలి చిత్రం. అంతే కాదు ఇందులో ప్రధాన ప్రతినాయక పాత్రలో శ్రీ కోన ప్రభాకర రావు గారు (1916-1990) నటించారు. బాపట్లలో పుట్టిన ప్రభాకర రావు గారు మహారాష్ట్ర రాష్ట్రానికి గవర్నరుగా కూడా పనిచేసారు. కథానాయిక శ్రీమతి జి.వరలక్ష్మి. వీరు కాక అలనాటి ప్రముఖ నటి, రాజ్యం పిక్చర్స్ నిర్మాణ సంస్థ అధినేత శ్రీమతి లక్ష్మీరాజ్యం (1922-87) ఒక ముఖ్య పాత్ర పోషించింది. "సంస్కార విహీనులకు సహన శక్తి వుండదు. సహన శక్తి లేని అనుభవజ్ఞుడు, అధికారి, బికారి ఒకే విధంగా ఉద్రేకానికి లోనయినపుడు శాంతి, అహింస, సత్యాలకు దూరం అవడం తప్పదు" అనే ఇతివృత్తం తో నిర్మించబడిన ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు జి.వరలక్ష్మితో "పూవు చేరి పలుమారు తిరుగుతూ" అనే ఒక యుగళగీతం పాడారు. దాని సాహిత్యం, ఆడియో ఇక్కడ పొందుపరుస్తున్నాను.
ఆడియో మూలం: ఘంటసాల గానచరిత
చిత్రం: ద్రోహి (1948)
గానం: ఘంటసాల, జి.వరలక్ష్మి
రచన: తాపీ ధర్మారావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
ఘంటసాల: పూవు చేరి పలుమారు తిరుగుతూ
పాట పాడునది ఏమో తుమ్మెద
పాడునది ఏమో
జి.వరలక్ష్మి: పూవులోన తన పోలిక కన్గొని
మోదము గాంచినదేమో తుమ్మెద
మోదము గాంచినదేమో
ఘంటసాల: ఆ సెలయేటిని తాకుచు తట్టుచు
చెప్పుచున్నదది యేమో పూపొద
చెప్పుచున్నదది యేమో
జి.వరలక్ష్మి: ఒక క్షణమైన ఆగి పల్కవని
కొరకర లాడునొ ఏమో పూపొద
కొరకర లాడునొ ఏమో
ఘంటసాల: అలరు కౌగిటను అదిమి మావితో
మంతన మాడునదేమో మాలతీ
మంతన మాడునదేమో
జి.వరలక్ష్మి: ఏకాంతముగా ప్రణయ మంత్రమును
ఉపదేశించునొ యేమో మాలతి
ఉపదేశించునొ యేమో ..
ఉపదేశించునొ యేమో
ఇద్దరు: ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
యేది చూసినా ప్రేమయె జగతి | యేది చూసినా |
కాదను వారలు పాషాణాలే | కాదను వారలు | కృతజ్ఞతలు: పాటల సాహిత్యం మొదలగు వివరాలకు: ఘంటసాల గళామృతము - పాటల పాలవెల్లి మరియు సఖియా ఆడియో మూలం: ఓల్డ్ తెలుగు సాంగ్స్ డేటాబేస్
ఈ కార్తీక మాసంలో పరమ శివుని పై ఘంటసాల మాస్టారు పాడిన కొన్ని పద్యాలు, శ్లోకాలు, పాటలు ముందు పోస్టులలో పొందు పరచాను. అయితే కార్తీక మాసము పూర్తి అయ్యే లోగా ఏదైనా చిన్న శ్లోకమో, పద్యమో ప్రస్తుతిద్దా మనుకునేసరికి అనుకోకుండా తెనాలి రామకృష్ణ (1956) చిత్రంలోని ఒక సన్నివేశంలోని శ్లోకం శివునికి సంబంధించినదని అంతర్జాలంలో కొంచెం శోధించాక తెలిసింది. బహుశ ఇది చాలమందికి తెలుసనుకుంటాను. నాకు ఇపుడే తెలిసింది. ఇక ఉండబట్టలేక ఈ పోస్టు వ్రాస్తున్నాను. దేవి వరప్రసాదం వలన రామకృష్ణుడు వికటకవియై, శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో చేరి, తన చతురతతో, సమయస్ఫూర్తితో, అందరినీ ఆనందింపజేసేవాడు. తెనాలి రామకృష్ణునితో కలసి మొత్తం ఎనిమిది మంది కవులు (అష్ట దిగ్గజములు) గల సభను భువనవిజయము అని కూడ అంటారు. ఒక రోజు భువన విజయానికి 'సహస్ర ఘంటకవి' అని బిరుదుగల ప్రెగడ నరసరాజు కవి వచ్చి, తాను "పట్టిన ఘంటం ఆపకుండా వ్రాస్తానని, పరుల కవిత్వలో తప్పులు పడతానని", తన ప్రతిభను గౌరవించి జయపత్రిక ఇవ్వమని రాయలవారిని అడుగుతాడు.
రాయల అనుమతి మీదట ముందుగా అల్లసాని పెద్దన అందుకుని
మరుద్వృధా తటస్థ
శత్రు మండలీ గళాంతర
క్షరన్న వాస్యగాపగాభిసారికాదృతాంబుధీ
మరుత్పతిస్వరుక్షతిక్రమత్రుటత్కుభృద్వర
స్ఫురద్వని
ప్రవృద్ధ యుద్ధ పుంఖితానకార్భటీ
అనే పద్యం చెబుతాడు. ఈ పద్యానికి నేను సేకరించిన విశ్లేషణ, వివరణ ఈ విధంగా వున్నాయిః
ప్రతిపదార్థము - మరుద్వృధా
= కావేరీ నది యొక్క (మరుత్ = గాలుల చేత, వృధా = వృద్ధి గలది); తటస్థ = తీరమునందున్న;
శత్రు మండలీ = శత్రు సమూహముల యొక్క; గళాంతర = గొంతుకల మధ్య నుండి; క్షరత్ = జారుచున్న;
నవాస్యగాపగా(?) = క్రొన్నెత్తురు పేరులనెడు; అభిసారికా = అభిసారికయనగా ప్రియుని గూర్చి
చనునట్లు నుండెడి స్త్రీ; అదృత = సంతోషపరుపబడిన; అంబుధీ = సముద్రము;
తాత్పర్యము - అనగా కృష్ణరాయలు
కావేరీ తీర ప్రాంతములందలి శత్రు రాజులను జంపి వారి నెత్తురును ఏరులుగా ప్రవహింపజేసి
సముద్రము వరకు పారునట్లు చేసెననియు, అవి చూడ నా నెత్తురుటేరులు అభిసారికలవలె సముద్రము
వరకు బోవుట అని భావము.
ప్రతిపదార్థము - మరుత్పతి =
ఇంద్రుని యొక్క; స్వరు = వజ్రాయుధము యొక్క; క్షతిక్రమ = వేటుల వరుస చేత; త్రుటత్ =
పగిలిన; కుభృద్వర(?) = పర్వత శ్రేష్ఠముల వలె; స్ఫురత్ = అధికమగు; ధ్వని = శబ్దముల చేత;
ప్రవృద్ధ = అతిశయించుచున్న; యుద్ధ = యుద్ధమునందలి; పుంఖిత = గుంపులగు; ఆనక = భేరుల
యొక్క; ఆర్బటీ = మ్రోత గల వాడా.
తాత్పర్యము - అనగా కృష్ణరాయలు
యుద్ధము నందు తీసికొని పోవు భేరుల మ్రోతలు దేవేంద్రుని వజ్రాయుధ హతిచే కూలు; పర్వత
ధ్వనుల వలె నొప్పెనాని భావము.
(సేకరణ - తిమ్మనార్య
కృత పారిజాతాపహారణ కావ్యమునకు శ్రీ నాగపూడి కుప్పుస్వామయ్య గారి వ్యాఖ్యానము నుండి.)
దీనిని సమీకరించి
స్పందన రూపంలో నాకు ఒసంగిన శ్రీ సూర్య (బెంగళూరు) వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ పద్యం వ్రాసానని నరసరాజు చెప్పడంతో, ఎలాగైనా ఈ కవి గర్వం అణచాలని నిశ్చయించుకుని తెనాలి రామకృష్ణుడు ఈ దిగువ గల పద్యం వ్రాయమంటాడు -
శివుని వర్ణన
త్పృవ్వటబాబా తలపై
పువ్వట జాబిల్లి, వల్వ బూదట, చేదే
బువ్వట, చూడగను ళుళు
క్కవ్వట, నరయంగ నట్టి హరునకు జేజే !!
ఈ పద్యం ఎలా ప్రారంభించాలో మొదట్లోనే ఇబ్బంది పడిన నరసరాజు ఘంటం ఆగిపోతుంది. అపుడు రామకృష్ణుడు మందలింపుగా ఇలా తిడతాడు.
తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్
పలుకగ రాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ
పలికిన నోట దుమ్ముబడ భావ్యమెరుంగవు పెద్దలైన వా
రల నిరసింతురా ప్రగడ రాణ్ణరసా! విరసా! తుసా! భుసా!
అపుడు రాయల వారు రామకృష్ణుని శాంతించమని నరసరాజ కవికి కావలసినంత ధనం ఇప్పించి పంపించేస్తాడు. తరువాత అదే పద్యాన్ని రాయల వారు తన భార్య తిరుమల దేవికి చెప్పగా, ఆమె చిత్ర రూపంలో ఆ పద్యాన్ని వ్రాసి చూపించి రాయల వారి కానుక గ్రహిస్తుంది.
ఈ శ్లోకంలో "అట" అనే శబ్దం పలుమార్లు వస్తుంది. త్పృవ్వ* = ఎద్దు (పశువుల కాపరులు ఆవులు కాస్తూ పెదవులతో చేసే ధ్వని ఇది. అలాగే తువ్వాయి కి అర్ధం "దూడ" అని; బాబా = వాహనము (ఇది బహుశా ఆవుగాని ఎద్దుగాని అంబా..అంబా. అని అరుస్తాయి. అందులోనుంచి పుట్టిన ధ్వని కావచ్చు; *నా చిరకాల మిత్రులు శ్రీ అహోబిల మురళి గారు హ్యుస్తను,టెక్సాస్ నుండి ఫోనుచేసి సూచించారు. త్ప్రువ్వత అనే పదం రాయల సీమలో వాడుకలో ఉండే పదం. దానికి అర్ధం నీరు అని. త్ప్రువ్ = నీరు; బాబా = శివుడు; తలపై నీరు (గంగ) కలవాడు = గంగాధరుడు లేదా శివుడు. వల్వ = వస్త్రము; బూది = విభూది లేక విభూతి లేక బూడిద; చేదే = చేదుగా ఉండెడిది (విషం); బువ్వ = ఆహారము; ళుళుక్కవ్వ = ఉండకపోవటం; (ఉదా.హుళక్కి); అరయంగనట్టి = అటుల వెలుగొందు; హరుడు = శివుడు; జేజే = విజయము.
తాత్పర్యం: తలపై గంగ ధరించిన వాడట. తల మీద చంద్రుడు పువ్వువలె ఉన్నాడట. విభూతే వస్త్రమట. చేదైనది (విషం) భోజనమట. దిక్కులేని వాడట. అట్టి పరమశివునికి జేజేలు.
గమనిక: ఈ వివరణ నా స్వంతం కాదు. ఆసక్తితో అంతర్జాలంలో శోధించగా ఒక బ్లాగులో దొరికింది నాకు. దానికి నా ఊహను జోడించి పైన వివరించాను. ఈ శ్లోకం యొక్క అర్ధం వివరించబడిన బ్లాగు లింకు కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అయితే మన తెలుగు మనం మరచి పోతున్న ఈ రోజులలో ఇలాంటి వివరణలు లభిస్తే పద్యాలను ఇంకెంతో ఆస్వాదించ వచ్చును. ఔత్సాహికులయిన తెలుగు ఆచార్యులు ఈ పనికి పూనుకుంటే చాల బాగుంటుంది.
ఒకసారి మద్రాసులో నటి అంజలీదేవి గారింటికి శ్రీ పుట్టపర్తి సాయిబాబా గారు విచ్చేసిన సందర్భంలో ఘంటసాల మాస్టారు స్వయంగా వ్రాసి వినిపించిన పాట యిది అని వారి శ్రీమతి సావిత్రమ్మ గారు తన స్మృతి తరంగాలు అనే పుస్తకంలో పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు ఈ పాట యొక్క ధ్వనిముద్రణం కాలేదు. ఈ పాట సాహిత్యం ఇక్కడ చూడగలరు. రచన: ఘంటసాల
1926 వ సంవత్సరం నవంబరు 23 న శ్రీ సత్యసాయి జన్మించారు. అమర గాయకులు శ్రీ ఘంటసాల గారు బాబా భక్తులు. బాబాగారి పై కొన్ని మధుర గీతాలు వ్రాసి, స్వరపరచి, గానం చేసారు. ఈ గీతాలు "ఘంటసాల గాన చరిత" మరియు ఇంకొన్ని వెబ్ సైట్లలో లభ్యమవుతున్నాయి. ఈ రోజు శ్రీ సత్యసాయి 85 వ జన్మదినం సందర్భంగా మాస్టారు పాడిన ఈ పాటను ఆడియో, వీడియో, మరియు సాహిత్యం తో ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఈ పాటను ఇదివరలో నా "స్వగతం" బ్లాగులో పోస్టు చేసాను. ఇది బాబా గారిపై మాస్టారి పాట కనుక శ్రీ సత్యసాయి పుట్టినరోజు సందర్భంగా మరల ఈ బ్లాగులో పునః ప్రచురించడం సముచితం అనిపించింది.
చిత్రం:జయభేరి రచన: శ్రీశ్రీ సంగీతం: పెండ్యాల గానం: ఘంటసాల
ఒక భక్తి గీతంలో కూడా తన సంతకపు మార్కును, కలం పవరును చూపించిన ఘనత మహాకవి శీశ్రీది అనడానికి నిదర్శనం 1959 లో విడుదల అయిన "జయభేరి" చిత్రం లోని ఈ పాట. సమ సమాజ స్థాపన ధ్యేయంగా శ్రీశ్రీ ఎన్నో చక్కని రచనలు చేసారు. జయభేరి లోని పాటలో, "శివ భక్తులలో అధికులు, అధములు అనే వ్యత్యాసం లేదు. ఈ భేదాలు మనిషి దృష్టిలో తప్ప భగవంతుని చరాచర సృష్టిలో లేవు" అని ప్రబోధించిన పరమ శివ భక్తుడు "భక్త నందనార్" హృదయ నివేదన ఈ పాట. ఈ సాహిత్యానికి పెండ్యాల గారు కట్టిన బాణీ పది కాలాలు గుర్తుంటుంది అందరికీ. అయితే అన్నిటికీ మించి ఒక భక్తుడు పొందే ఆవేదనను, ఇచ్చే సందేశాన్ని తన గాత్రంలో పై స్థాయిలో కూడా పట్టు జారకుండా అద్భుతంగా చిరస్థాయిగా ఉండేట్లు పాడారు మన ఘంటసాల మాస్టారు. ఆయన గొంతులో తారా స్థాయిలో "పరంజ్యోతిగా వెలయించే" అన్నప్పుడు మనకు నిజంగా పరమ శివుడు ప్రత్యక్షమై ఆ భక్తుని కోరిక తీర్చాడా అన్నంత అనుభూతి, ఉద్వేగం కలుగుతాయి. తెలుగువారు చేసుకున్న పూర్వ జన్మ సుకృతం ఘంటసాల గారిని వరం గా పొందటం. ఈ పాట వీడియో, ఆడియో మరియు సాహిత్యం ఇక్కడ పొందు పరుస్తున్నాను.
వీడియో పొందుపరచిన శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి ధన్యవాదాలు.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com