పాతాళ భైరవి చిత్రంలో సదాజపుడు గా మంచి పేరు తెచ్చుకున్న  పద్మనాభం (బసవరాజు పద్మనాభ రావు) 1965 లో రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ అన్న తన స్వంత బ్యానరు ను ప్రారంభించి తొలుత ఎన్.టి.ఆర్. కథానాయకుడుగా దేవత (1965) చిత్రం నిర్మించారు. తరువాత తనే కథానాయకుడుగా టైటిల్ పాత్ర పోషించిన మరొక స్వంత సాంఘిక చిత్రం పొట్టి ప్లీడరు (1966). పొట్టి ప్లీడరు చిత్రానికి సంగీత దర్శకులు ఎస్.పి.కోదండపాణి. శొభన్‌బాబు, వాణిశ్రీ, గీతాంజలి ఇతర ప్రముఖ తారాగణం. చిత్రంలో పనిచేసిన సాంకేతిక నిపుణులకు ప్రాముఖ్యతనిస్తూ, టైటిల్సుకు బదులు వెరైటీగా ఆయా శాఖల నిర్వాహకులను సజీవంగా చూపించి, వారి పేరు మరియు వారు నిర్వహించిన విభాగం గురించి ప్రేక్షకులకు పరిచయం చేస్తూ, చిత్రీకరించిన ఘనత పద్మనాభానిదే.  ఇక్కడ పొందుపరచిన మొదటి వీడియోలో అరుదుగా కనిపించే దృశ్యం లో ఘంటసాల మాస్టారు, శ్రీశ్రీ లతో పాటు పలువురిని చూడవచ్చు. తరువాతి వీడియోలో మాస్టారు ఈ చిత్రానికి పాడిన ఒకే ఒక పాట "చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే" అన్న కొసరాజు రచన పద్మనాభం పై చిత్రీకరించారు. (దురదృష్ట వశాత్తు ఇదివరటి దృశ్యఖండికను యూ ట్యూబ్ వారు తొలగించారు. ప్రస్తుతం 'చీకటి విచ్చునులే' పాట మాత్రమే చూడగలరు.)
                చిత్రం:             పొట్టి ప్లీడరు (1966)
                రచన:             కొసరాజు
                సంగీతం:         ఎస్.పి.కోదండపాణి
                గానం:             ఘంటసాల
పల్లవి:           చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే-2
                ఎపుడో ఒకసారి ఏదో ఒకదారి దొరుకునులే బాటసారి
                చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే-2
చరణం:          అయినవాళ్ళు లేరనీ దిగులు చెందకోయ్
                ఉన్నవాళ్ళె నావాళ్ళని అనుకోవలెనోయ్                  || అయినవాళ్ళు ||
                స్వేచ్ఛగా దిక్కులేని పక్షులు విహరించవా 
                హాయిగా నోరులేని పశువులు జీవించవా 
                భయమెందుకు పదముందుకు ఓయి బాటసారి  
                చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే
                ఎపుడో ఒకసారి ఏదో ఒకదారి దొరుకునులే బాటసారి
                చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే
చరణం:          ఆశతోటి లోకమంత బ్రతుకుతుందిరా..
                అందులోనె కథ అంతా తిరుగుతుందిరా                   || ఆశతోటి ||
                కష్టానికి సౌఖ్యానికి లంకె వుందిరా 
                ఈ కాలచక్రమును ఆపగ ఎవరి తరమురా 
                భయమెందుకు పదముందుకు ఓయి బాటసారి 
                చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే
                ఎపుడో ఒకసారి ఏదో ఒకదారి దొరుకునులే బాటసారి
                చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే
                ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

