శ్రీ కృష్ణదేవ రాయల ఆస్థానంలో గల సంగీత పీఠాన్ని భువనవిజయం అంటారు. రాయలు తెలుగు భాషకు ఎనలేని సేవ చేసాడు. తను రచించిన ఆముక్త మాల్యద (గోదాదేవి చరిత్ర) లో "దేశ భాషలందు తెలుగు లెస్స" అని పలికాడు. రాయల భువనవిజయంలో గల ఎనిమిది మంది కవులను "అష్ట దిగ్గజాలు" అంటారు. వారిలో ధూర్జటి కవి ఒకరు. ఇతనినే పెద ధూర్జటి అంటారు. శ్రీ కృష్ణదేవరాయల వారికి ఇతడంటే చాల అభిమానం. తన మాటలలో, కవిత్వంలో శ్లేష వాడటం ఈయనకు అలవాటు. శ్రీకాళహస్తికి చెందిన ఈ కవివరేణ్యుడు శివుని పై శ్రీకాళహస్తి మహత్మ్యం, కాళహస్తి శతకము, పలు చాటువులు రచించాడు. ధూర్జటి గురించి మరికొన్ని వివరాలు. రాయల పరిపాలన, కవితా వైభవం, శత్రు శక్తులతో పోరాటాన్ని ఘంటసాల మాస్టారి పద్యాలతో, పాటలతో అద్భుతంగా మలచిన దృశ్య కావ్యం 1956 లో విడుదలైన తెనాలి రామకృష్ణ చిత్రం. సంగీతం విశ్వనాథన్-రామ్మూర్తి.
Thanks to "tenaliramakrishnudu" for uploading the You Tube video.
ఒకపరి భువన విజయము అనే తన కవితా దర్బారులో శ్రీ కృష్ణదేవరాయలు అష్ట దిగ్గజాలతో కొలువై ఉంటాడు. రాయలు ఒకానొక దిగ్గజమైన ధూర్జటి ని స్తుతిస్తూ ఒక పద్యం అందుకుంటాడు.
స్తుతమతియైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల గల్గెనో
అతులిత మాధురీ మహిమ?
అతులిత మాధురీ మహిమ?
అయితే దొరికినదే సందని ధూర్జటి చీకటింటి భాగోతాన్ని బయట పెట్టాలని వికటకవి రామకృష్ణుడు వెంటనే లేచి ఈ విధంగా చమత్కారమైన సమాధానంతో పూరిస్తాడు.
ఆ.. తెలిసెన్ భువనైక మోహనో
ద్దత సుకుమార వారవనితా జనతా ఘనతాపహారి సం
తత మధురాధరోదిత సుధారస ధారల గ్రోలుటంజుమీ !
అని పూరించి దూర్జటితో "అంతేనా తాతయ్యా?" అని ప్రశ్నిస్తాడు. దానికి ధూర్జటి తేలుకుట్టిన దొంగలా "ఔనేమో మనవడా!" అని సమాధానం యిచ్చేసరికి సభ అంతా పగలబడి నవ్వుతారు. ఎందుకంటే, "వనిత" అంటే స్త్రీ, కాని "వారవనిత" అంటే వేశ్య. ఆవిధంగా వికటకవితో గిల్లి కజ్జా పెట్టుకుని గెలిచిన వారు లేరు రాయల సభలో. అందుకే అతనంటే రాయల వారికి అంత యిష్టం. ఇలాంటి సాహిత్య ప్రక్రియలు, చెణుకులు, విసుర్లు వింటుంటే మనసుకు ఎంతో ఆనందంగా వుంటుంది.
ఇంతకూ వికటకవి నిజమే చెప్పాడా, సాటి కవి, పెద్దవాడు అయిన దూర్జటిని అలా రాజకీయంగా దెబ్బతీశాడా అన్నది తెలియదు, ఖాళీగా గోళ్ళుగిల్లుకుంటూ కూర్చున్న సి.బి.ఐ తో ఎంక్వైరీ జరిపించాల్సిందే! :)
రిప్లయితొలగించండిఏదైతేనేమి, పద్యం అధ్బుతంగా పాడారు, మన ఘంటసాల మేస్టారు.
SNKR గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ధూర్జటి విపరీతంగా శ్లేష (pun)వాడేవాడట. అది వినివిని చాలమంది విసుగెత్తిపోయేవారట. అయితే ఏమీ అనలేకపోయేవారట. రామకృష్ణుడు వదిలిపెడతాడా! మరే విధమైన ఉద్దేశ్యం వుందో నాకు తెలియదండి.
తొలగించండిబాగుంది. చక్కటి సన్నివేశం. ఇదే పద్యము అదిత్య 369 లో బాలు గారి గొంతులో కూడా వినవచ్చు.
రిప్లయితొలగించండి"కృతమతి" కాదనుకుంట. అది "స్తుతమతి" అనుకుంట. "స్తుతమతి" అంటేనే యతి మైత్రి కుదురుతుంది.
శ్రీ సత్యనారాయణ గారు, చక్కగా పట్టుకున్నారండీ రామకృష్ణునిలా. సరిచేసాను. మీ స్పందనకు, నా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిmee blog chaala baagundandi... chaala teliyani viseshaalu chepparu.
రిప్లయితొలగించండివినయ్ చక్రవరి గారు, ధన్యవాదాలు.
తొలగించండి