1966 లో విడుదలైన శ్రీకృష్ణ పాండవీయం ఎన్.టి.ఆర్. శ్రీ కృష్ణునిగా, ధుర్యోధనునిగా ద్విపాత్రాభినయం చేసి, దర్సకత్వం వహించగా వారి సోదరులు శ్రీ త్రివిక్రమరావు గారు ఎన్.ఎ.టి. పతాకంపై నిర్మించిన భారత-భాగవత కథాంశాల సమ్మిళిత చిత్రం. ఈ చిత్రంలో ప్రముఖ కన్నడ నటులు శ్రీ ఉదయకుమార్ భీమునిగా నటించారు. ఇతనికి 'పవనసుత' అనే బిరుదు కూడా వుంది. లక్క ఇంటికి కాపలా కాయమని చెప్పిన పని చెయ్యకుండా హాయిగా కునుకు తీస్తున్న భీముడిని ఉద్దేశించి శ్రీ కృష్ణుడు మాయా రూపంలో కట్టెదుట నిల్చి, నిజరూపంలో చెట్టు చాటున వుండి హెచ్చరికగా పాడే పాట "మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా". శ్రీ కొసరాజు గారు ఈ పాట వ్రాసారు. వారి పాటలకు ఒక ప్రత్యేకత వుంది. ఆయన ఎక్కువగా హాస్య నటులకు హుషారు పాటలు, సెటైర్లు, ఉదా. పెద్ద మనుషులు చిత్రానికి వ్రాసిన శివ శివ మూర్తివి గణ నాథా!, నందామయా గురుడా నందామయా, మొదలయినవి వ్రాసారు. అయితే శ్రీ కృష్ణపాండవీయం చిత్రానికి రాసిన ఈ పాట ఎంతో జీవిత సత్యాన్ని చాటి చెబుతుంది. అవసర సమయాలలో అప్రమత్తతగా ఉండక నిద్రపోయే బద్ధకస్తులను వెన్నుతట్టి నిద్రలేపి గుణపాఠం చెప్పడం ఈ పాట సారాంశం. ఘంటసాల మాస్టారు పాడిన తీరు, సాకి చెప్పిన విధానము ఎన్.టి.ఆర్. కు చక్కగా సరిపోయాయి. ఎన్ని సార్లు విన్నా ఈ పాట ఇంకా వినాలనిపిస్తుంది. దీనికి చక్కని బాణీ సమకూర్చినది శ్రీ టి.వి. రాజు (తోటకూర వెంకట రాజు) గారు. వీరి సంగీత దర్శకత్వంలో వచ్చిన మరికొన్నిచక్కని చిత్రాలు జయసింహ, శ్రీ కృష్ణావతారం మొదలయినవి. ఈ చక్కని సందేశాత్మక గీతం యొక్క దృశ్య చిత్రాన్ని, సాహిత్యాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.
సంగీతం: టి.వి.రాజు
గానం: ఘంటసాల వెంకటేశ్వర రావు
సాకీ: అపాయమ్ము దాటడానికుపాయమ్ము కావాలి
అంధకార మలవినపుడు వెలుతురుకై వెదకాలి
ముందుచూపు లేనివాడు ఎందునకు కొఱగాడు
సోమరియై కునుకువాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు
ప. మత్తు వదలరా నిద్దుర మత్తువదలరా | మత్తు వదలరా |
ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తవుదువురా.. | మత్తు వదలరా |
చ. జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు | జీవితమున |
మిగిలిన ఆ సగ భాగం చిత్తశుద్ధి లేకపోవు
అతినిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు | అతి నిద్రా |
పరమార్ధం గానలేక వ్యర్ధంగా చెడతాడు | మత్తు వదలరా |
సాకీ: సాగినంతకాలం నా అంతవాడు లేడందురు
సాగకపోతే ఊరక చతికిలబడి పోదురు
కండ బలముతోటే ఘనకార్యము సాధించలేరు
బుద్ధి బలము తోడైతే విజయమ్ము వరింపగలరు | మత్తు వదలరా |
చ. చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్ట బూనుమురా | చుట్టుముట్టు |
పిరికితనము కట్టిపెట్టి ధైర్యము చేపట్టుమురా
కర్తవ్యము నీ వంతు, కాపాడుట నా వంతు | కర్త్యవ్యము |
చెప్పడమే నా ధర్మం, వినకపోతె నీ ఖర్మం
మత్తు వదలరా నిద్దుర మత్తువదలరా
ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తవుదువురా
మత్తు వదలరా నిద్దుర మత్తువదలరా
కార్యాతురాణాం న సుఖం న నిద్రా
గురువు గారు మంచి పాటను గుర్తు చేశారు ధన్యవాదములు
రిప్లయితొలగించండిధన్యవాదాలు. నాకు ఈ పాటంటే చాల యిష్టం.
తొలగించండి