ఇది భర్తృహరి రచించిన నీతిశతకము లోని మొదటి శ్లోకం.
దిక్కాలాద్యనవచ్ఛిన్నానంత చిన్మాత్ర మూర్తయే|
స్వానుభూత్యేకమానాయ నమ: శాంతాయ తేజసే||
పదవిచ్ఛేదన:
దిక్-కాలాది-అనవచ్ఛిన్న-అనంత చిన్మాత్ర మూర్తయే|
స్వానుభూతి-ఏక-మానాయ నమ: శాంతాయ తేజసే||
ప్రతిపదార్థం:
దిక్ - దిక్కులు; కాల - కాలము; ఆది - మొదలైన; అనవచ్ఛిన్న - బంధింపబడని ; అనంత - అంతములేని; చిన్మాత్ర - స్వచ్ఛమైన మేధస్సు; మూర్తయే - ప్రతిరూపమైన; స్వ - స్వీయ; అనుభూతి - అనుభవము లేదా భావన; ఏక - ఏకమైన లేదా ఒక్కటే; మానాయ - చిత్తోన్నతి; నమ: - నమస్సులు; శాంతాయ - శాంత స్వరూపుడైన; తేజసే - ప్రకాశవంతమైన.
తాత్పర్యం (మాస్టారు ఆలపించింది):
దేశ (దిశా*) కాల పరిమితిలేక, జ్ఞానస్వరూపమై, అనుభవముచేతనే ఎరుంగదగినదై, శాంతమైన జ్యోతిస్వరూపమగు పరబ్రహ్మకు నమస్కారము.
*దేశ అని కాక దిశా (దిక్కు) అని వుండాలని నా అభిప్రాయము.
ఈ తాత్పర్యం నా మాటల్లో:
దిక్కులు మరియు కాలం అనే పరిమితులకు అతీతుడైన, స్వచ్ఛమైన మేధస్సుకు ప్రతిరూపమై, కేవలం ఆత్మ ప్రయత్నం మరియు అనుభవం ద్వారానే అర్థం చేసుకోదగిన, ప్రకాశవంతమైన మరియు శాంత స్వరూపుడైన ఆ దేవునికి నమస్కారాలు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి