అహింసనే ఆయిధంగా చేసి, స్వరాజ్యం సంపాదించి, మనకు బ్రిటిషు వారి నుండి స్వేచ్ఛను కలిగించిన అద్వితీయ నాయకులలో మహాత్మాగాంధి ఒకరు. నవ భారత నిర్మాణానికి నడుం కట్టిన పూజ్య బాపూజీ మన జాతిపిత. యావద్భారతాన్ని ఒకే త్రాటిపై అహింసామార్గం లో నడిపించి, స్వాతంత్ర్యం సంపాదించి, దేశ విభజన నేపధ్యంలో మత వైపరీత్య శక్తులకు బలియై అసువులు బాసిన మహా మనీషి మన గాంధి. "నా జీవితమే నా సందేశం" అన్నారాయన. ఆయన జన్మదినం అక్టోబరు 2 వ తేదీ. ఈ రోజును ప్రతి సంవత్సరం 'గాంధీ జయంతి' గా జరుపుకుంటున్నాము. ప్రతి ఏటా మనకు వచ్చే శలవు దినం ఈ రోజు.
యధాలాపంగా ఈ రోజు రెండు నిముషాలు మౌనం పాటిస్తాం. అయితే ఈ మౌనం ఈ రోజే కాదు
ఎప్పటినుంచో మనకు అలవాటయి పోయింది. దేశ ఆర్ధిక, సామాజిక పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు. పాలక-పాలిత సంబంధాలు దెబ్బతిన్నాయి. వైషమ్యాలు, వర్గ, వర్ణ విచక్షణలు విపరీతమయ్యాయి. నదీ జలాల పంపిణీలో ఒక సామరస్యమైన సదవగాహన లేదు. సమస్య పరిమాణంతో పనిలేకుండా బస్సులు తగల బెట్టి, బందులు చేసి జనజీననాన్ని స్తంభింపజేసే పరిణామాలు నిత్యం మౌనంగా, నిస్సహాయంగా చూస్తున్నాము. పైరవీలు, పలుకుబడులు, అలవి మీరిన లంచగొండితనం, బంధుప్రీతి, అవినీతి రాజ్యం చేస్తున్నాయి. "స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి" అన్నారు శ్రీశ్రీ. అదే విధంగా సగటు భారత ప్రజల భవితవ్యం గురించి ఆరుద్ర తన గీతం లో విపరీతమైన నిరాశా, నిస్పృహ వెలిబుచ్చారు. ఆ గీతం పవిత్ర బంధం చిత్రం కోసం సాలూరు రాజేశ్వర రావు స్వరబద్ధం చేయగా, మాస్టారి గొంతులో వినండి.
పల్లవి: | గాంధి పుట్టిన దేశమా యిది నెహ్రు కోరిన సంగమా యిది | |
సామ్యవాదం, రామరాజ్యం సంభవించే కాలమా | ||
చరణం: | సస్యశ్యామలదేశం అయినా నిత్యం క్షామం | |
ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పుసముద్రం పాలు | ||
యువకులశక్తికి, భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు | ||
ఉన్నది మనకూ వోటు, బ్రతుకు తెరువుకే లోటు | || గాంధి పుట్టిన || | |
చరణం: | సమ్మె, ఘరావు, దొమ్మి, బస్సుల దహనం, లూఠీ | |
శాంతీ, సహనం, సమధర్మంపై విరిగెను గూండా లాఠీ | ||
అధికారంకై పెనుగులాటలో అన్నాదమ్ముల పోటీ | ||
హెచ్చెను హింసా, ద్వేషం, ఏమవుతుందీ దేశం | || గాంధి పుట్టిన || | |
చరణం: | వ్యాపారాలకు పర్మిట్, వ్యవహారాలకు లైసెన్స్ | |
అర్హతలేని ఉద్యోగాలు లంచంయిస్తే 'ఓ యస్' | ||
సిఫార్సు లేనిదె స్మశానమందు దొరకదు రవంత చోటు | ||
పేరుకి ప్రజలదె రాజ్యం, పెత్తందార్లకె భోజ్యం | || గాంధి పుట్టిన || |
Thanks to You Tube for providing the video of the movie clip.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి