మాచెర్ల చెన్న కేశవస్వామి ఆలయం |
పన్నెండవ శతాబ్దంలో పల్నాడు (ఉత్తర గుంటూరు జిల్లా) లోని మాచెర్ల మరియు గురజాల కు చెందిన దాయాదుల మధ్య వైష్ణవ-శైవ మత వైషమ్యాలు, రాజ్య కాంక్షల విభేదాలతో రగుల్కొన్న విరోధాల ప్రతిఫలం కారంపూడి రణభూమిగా జరిగిన పోరు "పల్నాటి యుద్ధం" గా తెలుగు చరిత్రలో ప్రసిద్ధం. సారూప్యంలో ఇదొక ఆంధ్ర కురుక్షేత్రం. గురజాల రాజు నలగామరాజు. ఇతని కొలువులోని సలహాదారుగా వున్న నాయకురాలు నాగమ్మ రాజనీతెరిగిన ప్రతిభాశాలి మరియు శివభక్తురాలు. నలగామరాజు సోదరుడు మలిదేవుడు మాచెర్ల రాజు. మలిదేవుని కొలువులో మంత్రి అయిన బ్రహ్మనాయుడు విష్ణుభక్తుడు. యితడు మాచెర్లలో చెన్నకేశవస్వామి ఆలయం కట్టించాడు. పరమతసహనం గలవాడై అన్నికులాలవారు సహపంక్తిని భోజనం చేయాలన్న "చాపకూటి సిద్ధాంతం" ప్రతిపాదించిన సామ్యవాది. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించి మాలదాసరులను చెన్నకేశవ స్వామి కోవెలకు అర్చకులుగా నియమిస్తాడు. ఈ చర్య మత విద్వేషాలను ఎక్కువ చేస్తుంది. ఈ జరిగిన చరిత్ర ఇతివృత్తంతో "పల్నాటి యుద్ధం" పేరుతో 1947 లోను, 1966 లోను చలన చిత్రాలు వచ్చాయి. 1947 లో వచ్చిన చిత్రంలో గోవిందరాజుల సుబ్బారావు, కన్నాంబ, ఎ.ఎన్.ఆర్.లు, 1966 లోని చిత్రంలో ఎన్.టి.ఆర్, భానుమతి , హరనాథ్ వరుసగా బ్రహ్మనాయుడు, నాగమ్మ, బాలచంద్రుడు (బ్రహ్మనాయుని కొడుకు) ల పాత్రలు పోషించారు. 1947 పల్నాటి యుద్ధం చిత్రంలో చెన్నకేశవస్వామి ఆలయంలోకి ప్రవేశిస్తూ ఆనందంతో హరిజనులంతా పాడే పాట "చూతము రారయ్యా చెన్నయ్యను చూతము రారయ్యా" ఘంటసాల వెంకటేశ్వర రావు, అక్కినేని నాగేశ్వరరావు, మాలవల్లి సుందరమ్మ, ప్రయాగ నరసింహ శాస్త్రి, బృందం గానం చేసారు. ఈ పాట సాహిత్యం, ఆడియోను ఇక్కడ పొందుపరుస్తున్నాను.
చిత్రం: పల్నాటి యుద్ధం (1947)
రచన: సముద్రాల రాఘవాచార్య
సన్గీతం: గాలి పెంచల నరసింహారావు
గానం: ఘంటసాల, అక్కినేని, సుందరమ్మ, ప్రయాగ, బృందం
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
పురుషులు: చూతము రారయ్యా చెన్నయ్యను
చూతము రారయ్యా ఆ..ఆ | చూతము |
సుందరమ్మ: కన్నుల పండువుగా కన్నయ్యను
చూతము రారమ్మా ఆ..ఆ..
స్త్రీలు: కన్నుల పండువుగా కన్నయ్యను చూతము రారమ్మా
అందరు: తరతరాల పాపాలు కరగి మరగి తొలగిపోయె | తరతరాల |
మొర వినెనో యిలవేలుపు దొరకె నేడు మన పాలికి | మొర వినెనో |
ప్రయాగ: చూతాము రారయ్యా చెన్నయ్యను
పురుషులు: మనం చూతాము, మనం చూతాము రారయ్యా చెన్నయ్యను
సుందరమ్మ: చూదాము రారమ్మ కన్నయ్యను
స్త్రీలు: మనము చూదాము, మనము చూదాము రారమ్మా కన్నయ్యను
అందరు: ఎల్ల లోకాలేలు చల్లన్ని సామినీ | ఎల్ల లోకాలేలు |
కళ్ళలో పెట్టుకుని కాపాడమందాము | కళ్ళలో |
అందరు: చూతము రారయ్యా చెన్నయ్యను చూతము రారయ్యా | చూతము |
దరిశెనమాయెనుగా సామీ! దరిశెనమాయెనుగా
మా జన్మ తరించెనుగా.. జన్మ తరించెనుగా
నీ దరిశెనమాయెనుగా
ఘంటసాల: చెన్నుడు మము దయ చూచెనుగా
పొన్నలు, పూవులు పూచెనుగా | చెన్నుడు |
వెన్నుని చూచిన మా కన్నులలో | వెన్నుని |
పున్నమి వెన్నెల గాచెనుగా | పున్నమి |
అందరు: దరిశెనమాయెనుగా సామీ! దరిశెనమాయెనుగా
చంద్రవంక జాలువార నాగులేరు పొంగార | చంద్రవంక |
పలనాడే సెలయేరై పరవశించెగా
మా పలనాడే సెలయేరై పరవశించెగా
దరిశెనమాయెనుగా సామీ! దరిశెనమాయెనుగా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి