- ఘంటసాల వెంకటేశ్వరరావు
"సుమారు రెండు దశాబ్దముల నుంచి సంగీత దర్శకునిగా, నేపధ్య గాయకునిగా సినిమా సంగీత ప్రపంచంలో నేను చేసిన పరిశ్రమకు ఆధారభూతమైన విశ్వాసాలకు, తద్భవమైన అనుభవాలు రసికులూ, రసజ్ఞులూ అయిన ప్రేక్షకలోకానికి తెలియజేయడం అప్రస్తుతం కాదనే నమ్మకంతో ఈ మాటలు వ్రాస్తున్నాను. తన సాధన, కృషి ఫలించాలంటే, సార్థకత చెందాలంటే ప్రతి కళాకారుడూ ప్రజలతో తనకు గల సంబంధాన్ని నిత్యము గుర్తిస్తూ, కళారంగంలో తనకున్న బాధ్యతలను, యెదుర్కొనవలసిన శక్తులను వారికి తెలియజేస్తూ వారి నుండి విజ్ఞతాపూర్వకమయిన సలహాలను, అభిమానోపేతమయిన సానుభూతినీ పొందుతుండటం అవసరమవుతుంది.
ప్రతి జాతి, సంస్కృతీ కళారంగంలో తన కృషినీ, ధ్యేయాన్ని, ఒక విశిష్టమైన పద్ధతిని రూపొందించుకొంటుంది. భారతదేశం కూడా సహస్రాబ్దాలుగా లలితకళలన్నిటిలో నూతన విశిష్టతను అడుగడుగునా ప్రస్ఫుటంగా ప్రకటిస్తూ తన సాధనను కొనసాగిస్తూనే ఉంది.
భారతీయ జీవన రంగంలో సంగీతకళకున్న స్థానం మరే సంస్కృతిలోనూ లేదని చెప్పడం సాహసం కాదు. భారతజాతి అనాదిగా, సంగీతకళను ప్రత్యేకమైన విధానాలతో, విభిన్న మార్గాలలో పయనింపజేసి ఎంతో ఉజ్జ్వలమైన ఫలితాన్ని సాధించింది. సంప్రదాయసిద్ధమైన ఈ కళావిశేషాన్ని విస్మరించి మనం ఏ విధమైన అభివృద్ధినీ సాధించలేము. భారతీయ సంగీతం ఎన్ని భిన్న సాంప్రదాయాల్ని అనుసరించినా, ఎన్ని భిన్న రీతుల్ని ప్రదర్శించినా, రససిద్ధిలో ఈ భిన్న ఫణతులు అవలంబించే మార్గములో ఒక విచిత్రమైన ఐక్యతను ఏర్పరచుకొంది. సూక్ష్మంగా పరిశీలిస్తే, భారతీయ సంగీతంలో ఏ ప్రాంతపుదైనా సరే ఏకత్వం గోచరించక మానదు.
ప్రధానంగా భారతీయ సంగీత స్రవంతి రెండు రసవాహినులుగా ప్రవహించినది. ఒకటి స్వరరాగతాళ ప్రధానమైనది. శాస్త్రీయమైన వ్యక్తిత్వాన్ని కలిగినది. నాదోపాసనకు ఉపయుక్తమైనది. రెండవది జీవన శకట ప్రయాణానికి అహరహమూ లయ కలుపుతూ నిత్యజీవితాన్ని సుమధురం చేసేది. మొదటిది ’మార్గ’ సంగీతమని, రెండవది ’దేశి’ సంగీతమని పండితులు చెప్పారు. ఒకటి రసాత్మకమైనది. రెండవది భావాత్మకమైనది. ఒకటి స్థితి ప్రధానమైనది, మరొకటి గతి ప్రధానమైనది. జీవితంలోని వైవిధ్యాన్ని తొలగించి ఒకే నాదాత్మలో స్వరాన్ని అనుభవింపజేసేది మార్గసంగీతమైతే, ఒకే ఆత్మను జీవితంలోని వివిధ రంగాలలో ప్రతిబింబించి హృదయస్పందనం కలిగించేది దేశి సంగీతం. మార్గసంగీత సంప్రదాయసరళి ఉన్నత వర్గాన్ని ఆకర్షించి రాజాస్థానములలోనూ, దేవస్థానములలోనూ తన ప్రతిభను ప్రసరింపజేస్తే, దేశి సంగీతం ప్రతి పామరుని హృదయస్థానంలోను సింహపథం చేసుకొంది. మార్గసంగీతం భారతీయాత్మతను తాత్త్వికమైన రసానుభూతితో మైమరపింపజేస్తే, దేశి సంగీతం రసికమైన రసపుష్టితో ప్రజానీకాన్ని మురిపింపజేసింది. ఇందుచేతనే శాస్త్రీయ వాగ్గేయ రచనలలో భక్తిభావానికే అధికమైన ప్రాచుర్యం లభించింది.
ఒక విధంగా అనుకోవచ్చును. శాస్త్రీయ సంగీతం భక్తిభావ పునీతమైతే, దేశి సంగీతం నవరసభరితం. జీవితంలోని ప్రతి రసాత్మక సన్నివేశాన్ని తనలో ఇముడ్చుకుంది దేశి సంగీతం. ఈ భిన్న రసాల సన్నివేశాలను ఒకే నాదవర్ణంలో చిత్రించినది మార్గ సంగీతం. ఉడుపుల వేళల్లో పచ్చని పొలాల్లో పని చేస్తూ, తమ కష్టాన్ని మరచి గొంతెత్తి పాడే పల్లె పడుచుల పాటలలోనూ, నూర్పుల కళ్ళాలలో ఆనందోత్సాహంతో ఊగుతున్న రైతు యువకుల పదాలలోను, ఏలేలో పాటలలోనూ, జోలపాటలలోనూ, పెండ్లిపాటలలోనూ, వదినా మరదళ్ళ సరాగాలలోనూ, ఆలూమగల సరసాలలోనూ, అత్తాకోడళ్ళ సంవాదాలలోనూ, నలుగుపాటలలోనూ, తత్త్వ కీర్తనలలోనూ, పడవపాటలలోనూ, యక్షగానాలలోనూ, బుఱ్ఱకథలలోనూ, గొల్ల సుద్దులలోనూ, వీధి భాగవతాలలోనూ, జముకలపాటలలోనూ వినిపించేది దేశి సంగీతమే. ఇంత వరకు మన జాతీయ సంగీతం, మార్గ పద్ధతి అయితేనేమి, దేశి పద్ధతి అయితేనేమి, వివిధశాస్త్రీయ సంగీత రచనల రూపంలోనూ, పద్యపఠన రూపంలోనూ హరికథాది రూపాలలోనూ, పైన చెప్పుకున్న దేశీయ రూపాలలోనూ వ్యక్తమయింది.
ప్రస్తుత నాగరిక జీవన విధానాన్ని బట్టి, పాశ్చాత్య సంగీత ప్రభావాన్ని బట్టి, వ్యావహారిక భాషా ప్రభావాన్ని బట్టి, ఒక నూతన సంగీత సంప్రదాయ నిర్మాణం అతి ఉత్సాహంగాను, అతి త్వరితంగాను సాగుతున్నది. కొంత కాలం నిశ్చలంగా ఉన్న మన దేశీయ సంగీతం సినిమా కళ యొక్క అభివృద్ధితో నూతనోత్తేజాన్ని పొంది కొత్త రంగులు రంగరించుకొంది.
ఈ నూతన సంగీత సంప్రదాయ నిర్మాణం సినీ సంగీత దర్శకుల ప్రతిభా విశేషాల బట్టి నిర్మింపబడుతున్నదవడం పరిణామమైనా, తన విశిష్టతకు భంగం కలిగిస్తున్నదేమోయని భయపడుతున్నది. అందుచేత సంగీతంలో నూతనమైన ప్రయోగాలనూ, వినూత్నమైన విశేషాలనూ, విచిత్రానుభూతులను వివిధ మార్గాలలో అభివృద్ధులను సినీ సంగీత దర్శకుల నుండి మాత్రమే దేశం ఆశిస్తున్నదనడం వాస్తవం.
ఇటువంటి పరిస్థితుల్లో సంగీతదర్శకుడు మన జాతీయ ధోరణులైన రసాత్మక ప్రాధాన్యమైన మార్గ సంగీతాన్ని, భావాత్మక ప్రాధాన్యమైన దేశి సంగీతాన్ని, విజాతీయ సంగీత రీతుల్ని, తన నూతన సంప్రదాయ సృష్టికి ఉపకరణములుగా తీసుకొంటున్నాడు.
ఈ నూతన సంప్రదాయ నిర్మాణం ఉత్తర భారతదేశంలోనే ప్రారంభించబడినదనటం సాహసం కాదు. సినిమా పరిశ్రమకు పూర్వం కూడా మన నాటక సంగీతంలో పద్యపఠనానికి శాస్త్రీయ సంగీత రాగాలనూ, పాటలకు ఉత్తర దేశ లలిత సంగీత రచనలనూ, ఒరవడిగా తీసుకొనడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ సంప్రదాయ నిర్మాణం సినిమా యొక్క పారిశ్రామిక పరిమితుల్ని బట్టి మాత్రమే సాగుతున్నదన్న మాట యదార్థం.
నేటి వరకూ నడచిన సినిమా సంగీత చరిత్ర ఒక మారు సింహావలోకనం చేస్తే తొలినాటి సినిమా సంగీతంలోశాస్త్రీయ సంగీత ప్రభావమే ఎక్కువగా ఉండి రాగప్రధాన రచనలే ఎక్కువగా కనబడుతాయి. కాని కాలక్రమాన సంగీత దర్శకులు భాశ యొక్క పలుకుబడికీ, నుడికారపు గమనానికి, భావావేశానికీ దేశి సంగీతమే అనుకూలమైనదని గ్రహించారు. ఈ దేశిరీతిని సినిమా సంగీతంలో మొదట ప్రవేశపెట్టిన మార్గదర్శి నౌషద్ అనే మాట సర్వ జనామోదం పొందుతుందనే నమ్ముతున్నాను. దేశి సంగీత పద్ధతులలో, ప్రతి రసాత్మక సన్నివేశానికీ ఆయన తన సంగీత రచనలతో రూపించిన రాగ తాళముల ప్రయోగం సమకాలిక సంగీత దర్శకులకు స్వీకారయోగ్యమయినది. శృంగారగీతాలు, యుగళగీతాలు, విషాదగీతాలు, ప్రేమగానాలు, బృందగానాలు మొదలైన ఆయన సంగీత రచనలన్నీ ఆయనను నవ్య సాంప్రదాయ నిర్మాతగా నిరూపిస్తాయి.
నౌషద్ తోబాటు, ప్రతిభావంతులయిన ఇతర సంగీత దర్శకుల మేధస్సు కూడ ఈ క్రొత్త సంప్రదాయాన్ని సముజ్జ్వలపరిచింది. నవ్య సంగీత నిర్మాతలుగా పేర్కొనబడవలసిన వారిలో ప్రధానులు సి.రామచంద్ర, అనిల్ బిస్వాస్, పంకజ్ మల్లిక్, వసంత దేశాయ్, హేమంతకుమార్, ఓ.పి.నయ్యర్, శంకర్-జైకిషన్లు, మరొక ముఖ్యులు ఎస్.డి.బర్మన్. దక్షిణదేశంలో స్వర్గీయ సుబ్బరామన్, శ్రీయుతులు రామనాథన్,
కె.వి.మహదేవన్, విశ్వనాథన్-రామ్మూర్తి, ఎస్.వి.వెంకటరామన్, సాలూరు రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు మొదలగు వారు గణనీయులు.
సినిమా సంగీతాన్ని స్థూలంగా పరిశీలించినప్పుడు గేయానికి చెందిన భాగం మన సంప్రదాయాలనూ, చిత్రీకరణకు అవసరమయే నేపధ్య సంగీతం పాశ్చాత్య పద్ధతులను అనుసరిస్తున్నట్టు తెలుసుకొనవచ్చును. గేయభాగాలలో కూడా విదేశీ సంగీతరీతుల్ని వాడిన సంధర్బాలు లేకపోలేదు. అయితే ఈ విధమైన ప్రయోగాల వలన మన జాతీయమైన పలుకుబడికి దూరమై అవాంఛితికి పాల్పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయమై సంగీత దర్శకులు శ్రద్ధ తీసుకొనటం ఎంతైనా అవసరం. అయితే ప్రస్తుత సంగీత రచనా విధానం ప్రయోగస్థితిలో ఉంది. నిర్దిష్టమైన పరిమితుల్ని ఏర్పరచి ప్రతిభావంతులైన సంగీత దర్శకుల కృషికి అవరోధం కలిగించే పరిస్థితిలో లేదు.
భారతీయ సంగీత చరిత్రలో జంత్రసమ్మేళన పద్ధతి నూతనమైనది. ప్రాచీన సంగీత రచనలలో ప్రత్యేకించి జంత్రసమ్మేళనకై నిర్దేశింపబడిన స్వరరచనలు కనపడవు. ప్రధానంగా భారతీయ సంగీతం మెలొడీ మీద ఆధారపడి ఉంది. ఇది రస నిష్పత్తికి గనుక యుక్తమైన రాగప్రస్తారానికి ప్రాముఖ్యతనిస్తుంది. ఇట్లు కాక పాశ్చాత్య సంగీతం హార్మోనీకి ప్రాధాన్యం ఇవ్వడం వలన జంత్రసమ్మేళనల విశయంలో పాశ్చాత్య
సంగీతకారులు అతి ఉదాత్తమైన ఫలితాలను సాధించియున్నారు. ఈ సమ్మేళన విషయంలో పాశ్చాత్య పద్ధతి నుంచి మనం తెలుసుకొనవలసినది ఎంతో ఉన్నది. వాది, సంవాది, వివాది స్వర ప్రయోగాలలో పాశ్చాత్యులు రసార్ణవం యొక్క అగాధమైన లోతులకి పోయారు. ఈ పరిస్థితులలో భారత సంగీత దర్శకుడు ప్రజారంజన అనే తన లక్ష్యసిద్ధి కోసం వివిధ విజాతీయ సంగీత సంప్రదాయాల సమన్వయం తన కృశిలో భాగంగా తీసుకొంటున్నాడు. ఈ క్రొత్త ప్రయోగాలలో కొన్ని అవాంఛనీయమైన ఫలితాలు రావచ్చును. అందుకు రసికలోకం నిరుత్సాహపడకూడదు.
సంగీత దర్శకుని బాధ్యత పాటలతోనే తీరదు. చిత్రంలోని ప్రతి సన్నివేశానికి ఆయా రసాలకు తగినట్లుగా నాదరూపమైన వ్యాఖ్య ఇవ్వటం కూడా అతని పనే. ఈ నాదాత్మకమైన వ్యాఖ్యనే రీరికార్డింగ్ అంటారు. ఈ రీరికార్డింగ్లో వినపడే నేపధ్య సంగీతం ఒక సంగీత దర్శకుని ప్రతిభకు దర్పణం వంటిది. రసాత్మకమైన సన్నివేశాలకు ఆయా రసోత్పన్న శక్తిగల ఈ సంగీత వ్యాఖ్యను సృష్టించటానికి ఎంతో భావనాశక్తి, కాలజ్ఞానమూ, అనుభవమూ అవసరం. అసమర్థమైన రీరికార్డింగ్ చిత్రం పేలవంగా తోపింపజేస్తుంది. ప్రజ్ఞావంతమైన రీరికార్డింగ్ బలహీనమైన సన్నివేశాన్ని కూడ చిత్రంలో కుదుటపరచగలదు.
ఎంతో ప్రతిభ, వ్యుత్పత్తి, అనుభవమూ కలిగిన సంగీత దర్శకుని కృషి కూడా వ్యక్తిగతమైన ఉదాత్త కళ లోభం వలన ప్రజాభిరుచికి దూరమయే అవకాశం ఉంది. అందుచేత సంగీత దర్శకుడు తన స్వంత కళాభిరుచితో బాటు, ప్రజాభిరుచి, చిత్ర పరిశ్రమ యొక్క ఆర్థిక నిబంధనలనీ గుర్తు పెట్టుకొనవలసి ఉన్నది.
నేపధ్య గాయకునిగా నాకు గల అనుభవాన్ని బట్టి నాలుగు మాటలు చెప్పవలసి ఉంది. నేపధ్య గాయకునికి శ్రావ్యమైన కంఠస్వరమూ, వివిధ సంగీత గమకములు పలికించగల శక్తితో బాటు రసభావములకు అనుగుణ్యమైన నాదోత్పత్తి, సుస్పష్టమైన ఉచ్ఛారణ, కంఠస్వరము యొక్క పట్టువిడుపులు తెలియడం చాలా అవసరం. తన భావాలను పోషించగల గాత్రశైలి ఏ శాస్త్రములోను, ఏ పారిభాశిక పదాలలోను నిర్వచించబడనిది. అనుభవమే గురువుగా తనకు తానై తెలుసుకోవలసినది. నా భావనలో నేపధ్య గాయకునికి సంగీత హృదయంతో బాటు కవిహృదయము, కంఠస్వరములోని మెళకువలతోనే నటించగల నటనాకౌశలము కూడా అవసరం.
వృత్తిని బట్టి నేపధ్య గాయకునికి బాధ్యత యింకా ఉన్నది. తన నుండి ఉత్తమ ఫలితాన్ని ఆశించే సంగీత దర్శకుల భావనకు అనుగుణంగా రస సంపూర్ణ సహకారం ఎంతో సద్భావంతో ఇవ్వవలసి ఉంది. ఈ సందర్భంలో వివిధ సంగీత దర్శకుల ప్రతిభాన్వితములైన సంగీత రచనలను తమ గాత్రమాధుర్యంతో రసికలోకానికి అందించిన ఉత్తమ గాయకులు ప్రశంసార్హులు. లతా మంగేష్కర్, గీతాదత్, శంషాద్, ఆశా, మహమ్మద్ రఫీ, తలత్ మహమ్మద్, మన్నాడే, ముఖేష్ మొదలగు ఉత్తరదేశ గాయకులు, సుశీల, లీల, జానకి, సౌందరరాజన్, గోవిందరాజన్, జయరామన్, లోకనాథన్, శ్రీనివాస్, రాజా, మాధవపెద్ది, పిఠాపురం మొదలగు దక్షిణదేశ గాయకులు సినీసంగీతసీమకు వరప్రసాదులుగా భావించవలసి ఉంది.
కళాకారునిగా నా అనుభవాన్ని బట్టి నా గాఢ విశ్వాసాన్ని తెలియజేసే మాట ఒకటి చెప్పవలసి ఉంది. కళాకారుని నుండి వ్యక్తమయ్యే కళాకాంతిలో అతడు జీవితంలో పొందిన అనుభవాల గాఢత్వము, తీవ్రత ప్రతిబింబించక మానవు. భావతీవ్రత, ఆర్ద్రత లేని హృదయం నుండి ఉత్తమమైన కళ వ్యక్తమయ్యే అవకాశం లేదు. అందుచేత కళాకారుడు కళాసాధనతో తుల్యంగా జీవిత అనుభవాల నుండి ఉన్నతమైన సంస్కారాన్ని కలిగించుకోవలసి ఉంది.
ప్రజల ఉత్తమమైన అభిరుచులతో, విజ్ఞత, బాధ్యత, సానుభూతితో కూడిన సద్విమర్శతో ప్రతిభావంతులైన సంగీత దర్శకుల ప్రజ్ఞావిశేషంతో, నేపధ్య గాయకుల నైపుణీరాగంతో మనసంగీత సంప్రదాయం ఎంతో వృద్ధిని, ఉత్తేజాన్ని పొందగలదని నా అచంచల విశ్వాసం."
సేకరణ: శ్రీ చల్లా సుబ్బారాయుడు, కనిగిరి (29-3-1963 ఆంధ్రపత్రిక వారపత్రిక)
ఈ శీర్షిక మాతృకను ప్రాజెక్టు ఘంటసాల లో చూడగలరు.
ఈ శీర్షిక మాతృకను ప్రాజెక్టు ఘంటసాల లో చూడగలరు.
గానగంధర్వుని అమూల్యాభిప్రాయాలు పంచుకున్నారు. ధన్యవాదాలు, సూర్యనారాయణ గారు.
రిప్లయితొలగించండిస్వాగతం. మీ సత్వరిత స్పందనకు ధన్యవాదాలు.
తొలగించండిChala bagundi
రిప్లయితొలగించండిఅప్పారావు గారు, ధన్యవాదములు.
తొలగించండిIam very happy to this.
రిప్లయితొలగించండిthanks for the wonderfulldocument.
పలు పత్రికలలో ఉచ్చారణ అన్న పదం ఉచ్ఛారణ గా వ్రాయబడుతోంది. ఇటీవలి కాలంలో సామాన్యంగా దొర్లే తప్పుల్లో ఇది ఒకటి.
రిప్లయితొలగించండిఅజ్ఞాత గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. వెబ్ పత్రికలలో, అందులో గూగుల్ లో సంయుక్తాక్షర పదాలకు వత్తులు వుంటే అవి వ్రాతలో కనిపించవు. అలాగే మూడు అక్షరాల దొంతి వుంటే..ఉదా. 'శాస్త్రీయ' అది 'శాస్తీయ' గానే కనిపిస్తుంది. అంటే కరా రావుడి చూపదు. ఇవి వెబ్ ఆధారమైన ప్రచురణలో ఉన్న కొన్ని లోటుపాటులు. అయితే మీరు చెప్పిన విధంగా పత్రికలలో (పుస్తకాలు) ఆ తప్పులు దొర్లాయంటే అది ప్రచురణకర్తల మరియు సంపాదకుల తప్పు. ఆ విషయంలో మీరు చెప్పినది అక్షరాల నిజం.
రిప్లయితొలగించండిఇంత అమూల్యమైన వ్యాసాన్ని చదివించినందుకు మీకు నా ధన్యవాదలు.
రిప్లయితొలగించండిప్రసాద్ అచ్యుత
అచ్యుత సత్యనారాయణ ప్రసాద్ గారు, మా బ్లాగు సందర్శించినందుకు ధన్యవాదాలు. మాస్టారు చాల బాగా వ్రాసారీ వ్యాసాన్ని. అమూల్యమైనది.
తొలగించండి