ఘంటసాల మాస్టారికి జన్మదిన శుభాకాంక్షలు
పాటలు పదికాలాలు పాడుకునేలా ప్రజలనోట నిలవాలి అన్నది ఘంటసాల స్వరదీక్ష. మాస్టారు కర్ణాటక సంగీతంతో పాటు హిందుస్తానీ రాగ పద్ధతులను, ప్రక్రియలను ఔపోసన పట్టి ఎంతో అద్భుతమైన స్వరసమ్మేళనతో మనకు ఎన్నెన్నో మధుర రాగాలను అందించారు. అలాంటి సుమదుర రాగాల కోవకు చెందిన మరొక మధురమైన సరికొత్త రాగం హేమంత రాగం. వేరెవరూ ప్రయోగించని, పండించని, నిండైన నాదనిధి, మనస్వర పెన్నిధి ఘంటసాల. ఆయన హేమంత్ రాగాన్ని తన స్వంతంచేసుకుని, స్వరసవరణలు చేసి, భక్తిగాని, రక్తిగాని, శక్తిగాని, ఏ భావానికైనా సరిపడేలా ఆరాగాన్ని మలచి దిద్దినారు. 'పెళ్ళి సందడి'లో తొలిబీజం నాటుకుని, 'శకుంతల'లో వర్ధిల్లి, 'రహస్యం' లో సాధించి పూర్ణ ఫలమైన రాగమిది. శ్రీ వేంకటేశ్వర వైభవంలో భగవంతునికంకితమై స్వరకైంకర్యాన్నొసగి, అమ్మకు హారతినిచ్చి, భగవద్గీతలో అహమాత్మా గుడాకేశ వేదానాం సామవేదోస్మి అంటూ ఆత్మతత్వాన్ని బోధించి తరించింది ఈ హేమంతం. మరుగునవున్న రాగానికి మెఱుగులు దిద్ది, నాదశుద్ధితో ఆత్మశుద్ధిని అందించిన ఆ అమరగాయకునికి ఆయన జన్మదిన సందర్భంగా స్వర పుష్పాలతో కూర్చిన ఈ 'ఘంటసాల హేమంత గానమాల' ఒక్క ఆనందానుభూతి పుష్పార్చన. శలవు.
సినిమా పాటకు "ట్యూన్" ఉంటుందేమోగాని రాగముంటుందా అంటారు! రాగముంటుంది అన్నారా, ఈ సంచారం నిషిద్ధం, ఇది అన్యస్వరం, అందుకని ఆ రాగం కాదంటారు. ఒకప్పుడు రంగస్థల సంగీతంలో రాగాలే ట్యూనులయ్యేవి. ఏది మొదట పుట్టింది? పాటా, రాగమా, స్వరాలా? జానపదంగా, సాంప్రదాయికంగా ఉభయవాదాలకూ తర్క- శాస్త్రాల అండ ఉంది. ఒక స్వరమండలము, రాగం కావడానికి, కనీసము ఐదు స్వరాలు అవసరమని శాస్త్రమంటే, మంగళంపల్లివంటివారు నాలుగు స్వరాల, మూడు స్వరాల రాగాలలో కృతులను రచించి, పాడి, సలక్షణం చేశారు. మూలాన్ని అన్వేషిస్తే మూడుస్వరాల పద్ధతి మనకు కొత్తగాదు. ఋగ్వేద మంత్రాల మౌఖిక సంవహన పద్ధతిలో, ఒక్క స్వరమే, ఉదాత్త, స్వరిత, అనుదాత్తములుగా మూడుస్వరాలైనట్టు మనకు తెలుస్తుంది. కాలక్రమాన అవే పెరిగి సప్తస్వరాలుగా పుట్టియుండవచ్చు. దానినే సామగాన మూర్ఛనమనిరి. ఆ సామగాన మూర్ఛన, ఇప్పటి మన ఖరహరప్రియ రాగంలా ఉండేది అంటారు. ఏడు స్వరాలే, ప్రకృతి వికృతి స్వరాల కూటమితో పన్నెండై, 72 మేళాల పరిధి ఏర్పడినను, ఔడవ, షాడవ స్వరసంఖ్యానుగుణంగా వేలకొలది సంఖ్యలో రాగాలు పుట్టాయి. అందులో ప్రసిద్దిపొందినవి రెండు మూడు వందల రాగాలే!. అంటే, రాగాల సంఖ్య పెరుగడానికి స్వరాల క్రమచయన మేళన ప్రక్రియ (pemutation combination) కారణమైనది. సినిమా సంగీతంలోనూ ఇలాంటి ప్రయోగాలు జరిగినా, ఇదొక కొత్త రాగం, ఇది దీని మూర్ఛనక్రమము అని ఎవరూ చెప్పలేరు. ఒక రాగం మరొక రాగమై పరివర్తన పొందడానికి, ఒక్క స్వరం వ్యత్యాసం కావడము, కోమలస్వరం తీవ్రమో, తీవ్రం కోమలమో, మూర్చనలో లేని మరొకస్వరం రావడమో, ఏదో ఒక్కటి జరిగినా, అది వేరొకరాగమే అవుతుంది. అన్యస్వరం అవరోహణంలో వస్తే ఒక రాగం, ఆరోహణంలో మాత్రమే వస్తే మరొకరాగం. ఇలా రాగ సృష్టికి అనంత సాధ్యతలు ఉన్నాయి.
సాలూరి, ఘంటసాల మరియు పెండ్యాలవంటి శాస్త్రీయసంగీతజ్ఞానం అఖండంగా ఉన్న విద్వాంసులకు ఒక సన్నివేశాన్ని అవగాహన చేసుకొని ఏ రాగంలో, ఏస్వరాల మార్పుతో, ఏ గమక వ్యత్యాసాలతో ఒక క్రొత్త బాణీని సృష్టించాలి అన్న ప్రజ్ఞ, రుచి, సాధనసంపద మెండుగా ఉండేది. "లవకుశ", "రహస్యం" చిత్రాలలో ఘంటసాల చూపిన ప్రతిభని గమనించి, మిగిలిన ఇరువురూ మెచ్చుకున్నారు. ఐతే తనలోని ప్రతిభా "శివశంకరిని", "రసికరాజ తగువారము కామా" అన్న స్థాయికి ఎదిగించి, మధురస్వరమైన తన "మది" శారదా మందిరమని విశ్వానికే వీనుల విందుగావించినది ఆ ఇరువురే కదా. ఆ ముగ్గురూ ముగ్గురే. మాధుర్యం, లాలిత్యం, పాండిత్యం మూడూ వారి సొమ్మే. ఆ స్వరాల, సరదాల పోటీలలో క్రొత్తవరుసలు పాటలలో మొలకలెత్తించి రంజింపజేసిన ఆ యుగం, లలిత సంగీతదేవతకు, నిరంతర నాదవేద స్వరాల విరుల శాశ్వత శ్రవణ శ్రావణాలు. కళ్యాణప్రదమై, మనమోహనమై, ఆ అభేరి, హిందోళ, పహాడి, సింధుభైరవి రాగదేవతలకు, ఆ ముగ్గురూ తొడిగించిన వేషాలు ఎన్నో. ఒకరికి మరొకరు సాటికాదని నిరూపించుకున్నారు. శ్రిహరి, "శతరాగరత్న మాలికచే రంజిల్లునట" అన్న త్యాగరాజస్వామినే స్ఫూర్తిగా, పూర్తిగా స్వీకరించిన ఘంటసాల మనోగతమైన మాటలేవి? పాట మనసులో రంజించాలి అన్నదే. "రంజకో జనచిత్తానాం సరాగః కథితో బుధైః", రంజింప జేసేది రాగం. "పాట నాలుగు కాలాల పాటు ప్రజలు పాడుకునేలా నోట నిలవాలి". ఆ లక్ష్యమును సాక్షాత్కరించుకోవడానికై ఎన్ని సాధనలు, ఎంతటి రాగాన్వేషణ చేశారో, ఆ వివరాలన్నిటిని, ఆయన మన ఉహకే వదలి పరమపదించారు. "రాగశ్రీ " రాగ ప్రయోగాలా, "మధుకౌంస్" రాగమా, తను సృష్టించిన నవ్యరాగాలనూ, సరికొత్త వరుసల అన్వేషణా అంతా కలసి అదొక లలితసంగీత యజ్ఞమే అవుతుంది. అలాంటి క్రొత్త ఆవిష్కరణలు, ఆయన పాడిన వేలాది పాటలలో మనకు దర్శనమిస్తాయి.
హేమంత్ రాగాన్వేషణ
రహస్యం చిత్రంలోని "సాధించనౌనా జగాన" చాలా ప్రసిద్ధి పొందిన పాట. అప్పటికి ఇది మాండ్ రాగంలా ఉందే అనిపించింది. కాని మాండ్ లోని 'సగమపదస", ఆరోహణంలోగల పంచమం ఈ పాటలో వినబడదు. ('తిరువిళ్ళైయాడల్' తమిళచిత్రంలో బాలమురళి పాడినది మిశ్రమాండ్: సససా దాదసా - ఒరునాళ్ పోదుమా, సగా రిసస - నాన్ పాడ, సా దప పమ - ఇన్రొరునాళ్ పోదుమా - దపమగా..) కాని, "సాధించనౌనా" పాటకు ఆరోహణస్వరాలు, స-గ-మ-ద-ని-స. ఇందులో "ద-ని" తీసి "పద" వేస్తే మాండ్. రెండూ ధీర శంకరాభరణజన్యమైన ఔడవ- సంపూర్ణ రాగాలే. రెండు రాగాలలో అవే సంపూర్ణ అవరోహణ స్వరాలు. అంటే ఈ మాండ్ కాని మాండ్ రాగంలా ఉన్న "సాధించ నౌనా" బాణిలోనే "అమ్మ" చిత్రంలోని పాట (అందాల లీలలో), పద్యం (ఏమి వర్ణింతువోయి కవిరాజా) ఉండడం అప్పట్లో గమనించాను.
"సాధించ నౌనా జగాన" పాటకు స్వరాలను గుర్తించగా దాని మూర్ఛన: "సగమదనిస - సనిదపమగరిస". గమదనిసా, గమనిదా గమగరిసా స్వరసంచారాలతో, గాంధార మధ్యమ స్వరాలు జీవస్వరాలైన ఒక అపురూపమైన రాగమిది. గాంధార - మధ్యమాలతో ప్రారంభమై, అవరోహణంలో రిషభంలో నిలవక, అలా తాకినట్టు వెళుతూ, షఢ్జ-గాంధార - మధ్యమాలనే పట్టి నడచే ధాటి ఇక్కడుంది.
ఘంటసాల బాణికట్టిన "శకుంతల"లోని "సరసన నీవుంటే జాబిలి నాకేల" అనే పాట ఈ రాగానిదే. శ్రీ పట్రాయని సంగీతరావుగారు ఘంటసాల భగవద్గీతాగాన రాగ వివరాలను గుర్తిస్తూ "అహమాత్మా గుడాకేశ" మరియు "వేదానాం సామవేదోస్మి" శ్లోకగానం ఈ రాగానికి చెందినది అన్నారు. సంగీతరావుగారు ఈ రాగాన్ని గురించి "ఒకప్పుడు ఘంటసాల గానానికి సితార్ వాదకులైన జనార్దన్ గారు, ఇది మాండ్ రాగం కాదు, తన గురువు పండిత్ రవిశంకర్ గారి గురువైన అల్లాఉద్దీన్ ఖాన్ సృష్టించిన మధుర రాగం" అన్నారని ఒకచోట చదివాను. రెండు పాటలూ మరియు రెండు గీతాశ్లోకాలూ "బసంత్ - జయవంత?" అనే రాగాలా అని పేర్కొన్నారని అక్కడ వ్రాశారు. ఇది జయవంత్ కాదు కదా అని, రాగనామాన్వేషణ కొనసాగింది. "రాగశాల" బ్లాగులో "హమీర్ కల్యాణి" వ్యాసానికి స్పందించిన శ్రీ రామప్రసాద్ గారు, సంగీతరావుగారు ఈ రాగం గురించి మాట్లాడిన ధ్వని ఖండికను నాకు అందించారు. అది విన్నాక, ఆయన చెప్పింది హేమంత్ రాగం అని తెలిసింది (ఒక పుస్తకంలో ముద్రితమైనట్టు జయవంత్ కాదు). కొంత లోతుగా అన్వేషిస్తే హేమంత్ మూర్ఛనకు ఘంటసాల కట్టిన "సాధించ నౌనా" బాణీకి పోలికలున్నాయి. ఘంటసాల "హేమంత్" రాగాన్ని యథాతథంగా అనుసరించలేదు. హేమంత్ రాగంలో లేని "ప్రతిమధ్యమ స్వరాన్ని" వినియోగించి ఒక కొత్తరాగాన్నే సృష్టించారు. మరొక శ్లోకాన్ని ఈ రాగంలోనే మాస్టారు "శ్రీ వేంకటేశ్వర వైభవం" చిత్రానికై పాడియున్నారు. (శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే). ఇవిగాక "అమ్మ" సాక్షచిత్రం (వార్తాచిత్రం documentary) లోని ఒకపాట మరియు ఒక పద్యం హేమంత్ రాగాధారితమే. ఈ రాగాన్ని తదితర సంగీత దర్శకులెవ్వరూ వాడలేదనే అంశాన్ని గమనిస్తే, ఇది ఘంటసాల సృష్టించిన రాగమా అనిపించకపోదు. తన సంగీత ప్రక్రియల గురించిగాని, తను సృష్టించిన క్రొత్త బాణీల గురించిగాని, ఘంటసాల ఎక్కడనూ మచ్చుకైన చెప్పుకోని నిగర్వి.
హేమంత్ రాగాన్ని ఘంటసాల ఎప్పుడు విన్నారో తెలియదు. కాని ఆ రాగాన్ని అనుసరించి తెలుగు చిత్రసీమలో వినబడె మొదటిపాట పెళ్ళిసందడి చిత్రంలో "రావే ప్రేమలతా" పాటకు ముందు "చూపుల తీపితో కొసరుచున్" అనే పద్యం (సామాజిక చిత్రమైననూ ఉత్పలమాల వృత్తములోని ఆ పద్యాన్ని ఉపయోగించడము గమనార్హం). ఈ పద్యం హేమంత్ రాగపు చాయల్లోనే నడుస్తుంది. మిత్రులు రామప్రసాద్ గారు ఈ సంగతిని నాకు జ్ఞాపకం చేశారు. స్వరాలను గుర్తిస్తుండగా, పద్యం తరువాత వినబడే "రావే ప్రేమలతా" వరుసనూ ఘంటసాల హేమంత్ రాగంలోనే సంయోజించినట్టు తెలిసింది. "రావే ప్రేమలతా నీవే నా కవితా - సా-సా-నీ దపమా, సా-నీ-దా-పమగా, కిన్నెర మీటుల కిలకిలవే - గామప రీగమ దానిని-సా" అంటూ Flat స్వరాలతో తక్కువ గమకాలతో నడిపించారు, మాస్టారు. ఇది జరిగింది 1959 లో. అలా నాటుకొన్న విత్తనం హేమంత్. ఎన్నో ఏళ్ళతరువాత "శకుంతల(1966)" చిత్ర్రంలో మొలకలెత్తిన పాట "సరసన నీవుంటె జాబిలి నాకేల (గమదని సానిదమా పామగ సాగాగ)" అనే యుగళ గీతం. మిత్రులు శ్రీ రామప్రసాద్ గారే, హేమంత్ రాగాధారితమై, ఘంటసాల స్వరసృష్టిలో అవతరించిన మరో రెండు పాటలనూ గుర్తుచేశారు. అవి "ఎందుకు పిలచితివో రాజా" (మర్మయోగి 1964) మరియు "ఓ! నీలజలదాల చాటున మెరిసీ బిజిలి" ఆన సాకీతో మొదలైయ్యే నృత్యగీతము (టైగర్ రాముడు) 1962).
ఈ రాగానుసరణతో, జ్ఞాపకాల పరిమిత వ్యాప్తిలో నేను గుర్తుంచుకొన్న మరికొన్ని పాటలు పద్యాలు ఇవి: శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే (వేంకటేశ్వర వైభవం), అందాల లీలలో (అమ్మ - సాక్ష్యచిత్రం విడుదల: 1975), ("అమ్మ" చిత్రంలోని " ఏమి వర్ణింతువోయి కవిరాజా " పద్యాన్ని నాకు అందజేసిన శ్రీ నూకల ప్రభాకర్ గారికి, పాటను (అందాలా లీలలో) పంచుకొన్న శ్రీనివాసమూర్తి గారికి నా నమోవాకములు). చివరగా హెమంత్ రాగం ఘంటసాల గళంలో మనకు వినబడెది భగవద్గీతా గానంలోని రెండు శ్లోకముల ద్వారా "అహమాత్మా గుడాకేశ" మరియు "వేదానాం సామవేదోస్మి".
ఈ కాల పరిధిలో (1959-1975) తెలుగు సినిమాలలోగాని, కర్ణాటక సంగీతంలోగాని ఎవరూ ఈ "హేమంత్" రాగం జోలికి పోయినట్లు వినబడదు. ఈ నేపథ్యంతో మనకు తెలియవచ్చే అంశమేమనగా, హేమంత్ రాగంలో ప్రయోగాలు చేసి, పరిష్కరించి, స్వరాల నవవిన్యాసాలను కట్టి, పాడి, పాడించినది ఒక్క ఘంటసాల మాత్రమే. "అమ్మ" సాక్ష్య చిత్రానికి సుసర్ల దక్షిణామూర్తి స్వరకర్తయైననూ అందులోని ఒక పాట (అందాల లీలలో) మరియు ఒక పద్యానికి (ఏమి వర్ణింతువోయి) ఘంటసాల రాగసూచనలు చేసియుండడం సంభవనీయం.
అందాల లీలలో (అమ్మ చిత్రం నుండి)
యేమి వర్ణింతునోయి (అమ్మ చిత్రం నుండి)
1. రావే ప్రేమలతా..(పెళ్ళి సందడి)
ప్రకృతిసౌందర్యాస్వాదనామగ్నుడైన నాయకునికి ప్రియతమ సాన్నిహిత్యము తోడై ప్రసన్న గంభీర ధ్వనితో వెలువడిన "హేమంత్" రాగవాహిని. హేమంత్ రాగం ప్రముఖంగా మధ్యమస్వరంలో విశ్రమిస్తూ వెళుతుంది. ఈ ఉత్పలమాల ప్రారంభమయ్యేది మధ్యమస్వరాలతోనె (చూపులతీపితో... మామమమామమా).
చూపుల తీపితో కొసరుచున్ దరిజేరి మనోజ్ఞా గీతికా (మమమమమమా గమమగా మదదనినీద ..)
లాపన సేయు కూర్మిజవరాలొకవైపు మరొక్క వైపునన్
ఈ పసి కమ్మతెమ్మరలు ఈ పువు దోటల శోభలున్నచో
రేపటి ఆశ నిన్న వెతలేటికి నేటి సుఖాల తేలుమా
ఒక్కొక్క పాదమూ స్వరాల సోపాన మార్గంలో సాగి చివరిభాగములోని ఆలాపన సమారోపమై, పద్యగానానికై అవతరించిన "హేమంత్" శాస్త్రీయ రూపాన్ని, ఘంటసాల యుగళగీత స్వరాలుగా మార్చడం, ఈ రాగానికి సంబంధించినట్లు, క్రొత్తప్రయోగమే.
పల్లవి : రావే ప్రేమలతా నీవే నా కవితా
(సాసానీదప పమపమా, సానీదాప మగామగా)
కిన్నెర మీటుల కిలకిలవే
(గామప రీగమ దానినిసా)
పలు వన్నెల మెరుపుల మిలమిలవే
(సరిగాగమ రీరిగ దానినిసా...)
ఇవే స్వరాలతొ మిగిలిన పల్లవి భాగం...
ఓహో కవిరాజా నేడే నెలరాజా
ఎందులకోయీ పరవశము
నీకెందులకో ఈ కలవరము
వాద్యం: గమదనినినీని సరినీ గమదనినినీని సనిదా... సగమదనిసనిద నిదామాగమా.. గగమమ గగమమ నిదపగమా గగమమ గగమమ నినిదమదా సాసా- దనిసనిదపనిదపమ దాదా...ఇలా పాశ్చాత్య వాద్యగోష్ఠిలా సాగుతుంది.
పూవులలో.. నును తీవెలలో
(మమమగమా.. గమదదదపదా)
ఏ తావున నీవే వనరాణి
(నిసగారిస రీసని పదమగమా)
వా: గమదనిసా ని రిని సద ని
ఇలా మిగిలిన చరణాలూ సాగుతాయి. 1959 లో విడుదలైన ఈ "పెళ్ళిసందడి" చిత్రాకి ముందుగా, "హేమంత" రాగాన్ని ప్రధానంగా, ఘంటసాల స్వరకల్పన చేసి ప్రయోగించిన వివరాలు మనకు తెలియవు. రాగమే క్రొత్తది. నవరాగాన్వేషణ నిమగ్నుడైన ఘంటసాలకు ఈ కొత్తరాగం విశేషానుభూతిని కలిగించియుండవచ్చు.
2. సరసన నీవుంటే జాబిలి నాకేల
ఆ తరువాత ఘంటసాల స్వరకర్తగా, గాయకుడుగా ఈ రాగాన్ని వాడుకున్న చిత్రం ఏడేళ్ళ తరువాత విడుదలైన "శకుంతల". పాట: సరసన నీవుంటే జాబిలి నాకేల. ఈ దుష్యంత-శకుంతలా యుగళగీతం, "రావే ప్రేమలతా" కంటే మధురంగా, ఒక పౌరాణిక చిత్ర స్థాయికి ఉండవలసిన శాస్త్రీయతను తనలో ఇమిడించుకొన్న పాట. సా-సా-నీ-ద-ప-మా (రావే ప్రేమలతా) అంటూ గమకానికన్న శుద్ధస్వరాల పైనే నిరాలంకరణగా సాగుట వదలి, "సరసన నీవుంటే" గమకశ్రీమంతాగా విజృంభిస్తుంది. పాటకు ముందు వినబడే మంగళధ్వని, ప్రేమ సన్నివేశాన్ని "హేమంత్" రాగం బాగా ప్రతిఫలించి వినిపిస్తుంది.
ఆ తరువాత ఘంటసాల స్వరకర్తగా, గాయకుడుగా ఈ రాగాన్ని వాడుకున్న చిత్రం ఏడేళ్ళ తరువాత విడుదలైన "శకుంతల". పాట: సరసన నీవుంటే జాబిలి నాకేల. ఈ దుష్యంత-శకుంతలా యుగళగీతం, "రావే ప్రేమలతా" కంటే మధురంగా, ఒక పౌరాణిక చిత్ర స్థాయికి ఉండవలసిన శాస్త్రీయతను తనలో ఇమిడించుకొన్న పాట. సా-సా-నీ-ద-ప-మా (రావే ప్రేమలతా) అంటూ గమకానికన్న శుద్ధస్వరాల పైనే నిరాలంకరణగా సాగుట వదలి, "సరసన నీవుంటే" గమకశ్రీమంతాగా విజృంభిస్తుంది. పాటకు ముందు వినబడే మంగళధ్వని, ప్రేమ సన్నివేశాన్ని "హేమంత్" రాగం బాగా ప్రతిఫలించి వినిపిస్తుంది.
దనిసగగ నిసనిదమ మాదపమగా నినినిని సనిదప పదాప దనీద మపామగ (సన్నాయి)
మమగాస దానిసాగామాగ.. దనిసాని మపమపగా.. సరిసని దానీస గమదా ( వీణాది వాద్యాల నేపథ్యం)
సరసన నీవుంటే జాబిలి నాకేల | అహ (గమదనిసానిదమా పామగ సాగాగ)
సరసన నీవుంటే జాబిలి నాకేల (గమదనిసానిదమా పామగ సాగాగ)
మనసున నీవుంటే స్వర్గము నాకేల (గమదని సాసాసా సానిద దనిసనీద మపాగ)
సరసన నీవుంటే జాబిలి నాకేల (గమదనిసానిదమా పామగ సాగాగ..(ఆ) మపగమరిగమగ..)
పసనిరిసా..గమ పసదనిమప మపమదపా.. సానిదప నిరీగమా నిదపమ.. సాగామదనిసా (నేపథ్యం)
నీకన్నులలో నిగనిగ చూసి (గమదనిససస నిసదని సాస)
నివ్వెరపోయెను తారకలు ఆ ఉం (నినినినిరీనిద ద1దపమ మదమద1ద).. (ఇక్కడ అన్యస్వరమైన శుద్ధదైవత ప్రయోగం)
తారలలోని తరుణిమ నీవై (దనిసగమగస నిసదప మదపమగ)
నన్నే మురిపింతువే అదే హాయ్ (నిసదని పదమామపా గామపగాస) | సరసన
రెండవ చరణమూ ఇదే స్వరధాటిలో సాగుతుంది
"శకుంతల" పాటకు సంవత్సరం నిండగానే 1967 లో ఈ "హేమంత్" రాగం "రహస్యం" చిత్రంలో పరాకాష్ఠత చెందింది. ఈ మూడుపాటలూ కాల క్రమంలో ఎలా వికసించి, రాగాన్వయమూ స్వరకల్పన ఎలా మాధుర్య శ్రేణిలో సాగింది అనేది గమనీయమైన అశం. ఇదొక స్వరరాగ సాధన. ఘంటసాల దాన్ని సాధించగా ఈ మూడువ పాట పల్లవి పెలికే భావమూ అదేకదా, "సాధించనౌనా జగానా !". ఎక్కడా చెప్పుకోక, అవలీలగా, నిరాడంబరంగా, అప్రచలితమైన హేమంత్ రాగం ఇలా ఖ్యాతిగాంచడం "సాధించనౌనా?"
3. ఓ నీలజలదాల చాటున మెరిసీ బిజిలి (సాకి)తో మొదలైయ్యే నృత్యగీతము (టైగర్ రాముడు) 1962
4. ఎందుకు పిలచితివో రాజా (మర్మయోగి) 1964
5. సా ధించనౌనా జగానా (సముద్రాల రాఘవాచార్య)
గా,స.. సాగమప మాగా.... మా, సాగమాదా దపపమమా... గమదనిసదానీసా....నిరిసనిదపమగగరిసా
తగిణ దిత్తదిత్ తజణ్ణుతాతా కిటతక దిత్ దిత్ తదాంతకిటతక...(నట్టువాంగమ్ కొనుగోలు వరసలు...)
స గ మ ద - గ మ ద ని -
సాధించనౌనా జగానా పలు పంతాలతో బలవంతాలతో చెలుల స్వాంతాలు భూకాంతులైనా..... | సాధించనౌనా |
దనిసనీ ద పమగా సగాగా, గాగా గమపమా గాగా, గామా దనిసనీదదా, దదని సగగారి రిగమరిగాస సా దాదద మామామ గాగగ |
సాధించనౌన... లైనా.. (నిసనిదపమగరిస) | సాధించ|
వాద్యసంగీతం:
సాసస...నిదానిదాని | నీనినిని... దమదమా|గమదనిసగమగమా..|-గమగరిసనిదదనీ..|నిసనిదపమగరిగమగా,,|-గమగరిసనిదని సా -గా మా గమదనిసా
తా తాంగిడతక తరిగిడతకతొం... (కొన్నకోలు)
కొనగోలు మధ్యల స్వరాలు : మా... దా...సనిద-నిదప-దపమ-గమద...గరిస-రిసని-సనిద-దనిస.. మగరి - గరిస - రిసద - నిసగ..
ముల్లోకమేలే సురాధీశుడైనా ముక్కంటి గొలిచే లంకాధీశుడైన
మామాగ పాపా - పపాపామ2 దపపమ2మా మాదాద దనినినీ దానీనీ రి నిదదా
ఆ: సరిససా-మపమమా-సరిసస మపమమ-నిసనిదపమగగ.. మామాగ (ముల్లోక..)
మనసందుకోనీ మానినిపొందుగోరి | పరాభూతులైనారు కా దా.. ఆ..
నిసదానిసాసా దనిసగగామగరిసా | సా దనిసనీద పదనిదామ మాగపామ సనిదపమగరిస | సా|
నిసదాద దనిమామ మదగాగ సాగామ... (తబలా తరంగ్ - ఆరు వివిధ శ్రుతుల తబలాలు)
గమగ దాదాద మదమ నీనీని దనిద సాసాస రి-నీని స-దాద ని-మామా దనిస (వీణావాద్యబృందం)
(కొన్నకోలు)
మంత్రాక్షులైనా మహా సిద్ధులైనా..(స్వరాలు "ముల్లోకమేలే" చరణములాగే)
ఆ: మా... సగమద మా...(సు) గమదా... మదనిదదా.. (ఘం), దానీసాని దనిదనిమా (సు) మాదానీద మపమపగా (ఘం)
(ఇద్దరూ) దనిసా గమగా మదమా దనిదా దనిసా, నిసగస నినిసని దదనిద పమగస..
మంత్రాక్షులైనా మహాసిద్ధులైనా స్వార్థాల పాలైన పతనమ్మె నిజము
తనమేలు మరచి అన్యులమేలు గోరే మానవునే వరించేను జయము (స్వరాలు : మనసందుకోని లాగే) | సా|
6.శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే (శ్రీ వేంకటేశ్వర కరావలంబన స్తోత్రం)
శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే
నారాయణాఽచ్యుత హరే నళినాయతాక్ష
లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక
శ్రీ వేంకటేశ మమ దేహి కరావలమ్బమ్
ఒకే రాగంలో ఎన్నో కీర్తనలు ఉన్న, వాటిలోని వ్యత్యాసాలు వాడిన స్వరాల తీరుని బట్టియుంటుంది. మంద్రంలో, మధ్యమంలో మరియు తారస్థాయిలోగాని, షడ్జ - పంచమాలతో గాని, రి-గ-మ-ద-ని వంటి జీవస్వరాలతో గాని, ఒక కృతి ప్రారంభమై మిగినవాటికంటె ప్రత్యేకతను పొందుతుంది. లలితసంగీతంలో, హిందుస్తాని ప్రభావాన్నిబట్టి, ఒక అన్యస్వరప్రయోగంతోనే పాట బాణీని ప్రత్యేకంగా సృష్టించవచ్చు. "రావే ప్రేమలతా" ప్రారంభమయ్యే తీరుని గమనిస్తే, సా(మధ్యమ)సా (తార) నీదపమా అంటూ రెండు షడ్జమాలతో పాట మొదలౌతుంది. " సరసన నీవుంటే" పల్లవికి స్వరాలు "గమదని సానిదమా", గాంధారంతో మొదలై మధ్యమంలో కొద్దిగ నిలుస్తుంది. "సాధించ నౌనా" ప్రత్యేకతను, దనిసనీద పమగా సమామా స్వరాలతో సాధించారు మాస్టారు. "సరసను నీవుంటే" పాటలో అన్యస్వరం: శుద్ధదైవతం. " సాధించనౌనా" లోని అన్యస్వరం: ప్రతిమధ్యమం. అలాగే అన్యస్వరంగా నిషాదాన్ని మార్చి, ఘంటసాల స్వరకల్పన చేసిన పాట "పుణ్యవతి" చిత్రంలోని " మనసు పాడింది సన్నాయిపాట". ఇక్కడ పేర్కొన్న పాటలు - పద్యాలకు "హేమంత్" రాగమే మూలం అనడానికి ఆధారం, ఆ రాగం నడిచే స్వరాలు. స-గ-మ-ద-ని-స | స-ని-ద-ప-మ-గ-రి-స. ఇవి ధీర శంకరాభరణం స్వరాలు. అవరోహణంలో స-గ-మ-ద-ని ఉంటే, కొన్ని పాటల స్వరాలలో సరిగ, మపమనిసరి వంటి కూటమి ఎలా సాధ్యం అన్న ప్రశ్న సంగీతం తెలిసినవారికిరాదు. "సరిగమ" కూడదు. సగమదనిస అని ఉన్న అవరోహణంలో పూర్ణస్వరాలున్నాయిగనుక "గరిస" "సరిగ" ప్రయోగం నిషిధ్ధం కాదు. సరిగమ నిషిద్ధం. మపద - కూడదుగాని మపమ సంగతమే. ఈ స్వరరహస్యాలను తెలిసిన ఘంటసాల, హేమంత్ రాగాన్ని అద్భుతంగా పండించుకొని, ఒకే రాగమైననూ, పాటలలో వైవిధ్యాన్ని చూపగలిగినారు. ప్రతి పాటనూ గమనిస్తే, ఆయా పాటల పల్లవుల - చరణాల ముందు వెనక వాద్య బృందానికై సృష్టించిస బాణి ఒక్కొక్కటీ ప్రత్యేకమే.
7. మనసు పాడింది సన్నాయి (1967 పుణ్యవతి)
(పపపా పదపామ గమపమగాస గామపమాగ)
కనులు ముకుళించగా తనువు పులకించగా
(గగమ దదదా ని(2)పా గగమ నినినీ(అన్నీ ని3) స దా)
హృదయమే పూల తలంబ్రాలు కురిపించగా
(దదని సగా గామ గమగాస నిసనీద గమదనిసానిదమపమాగ..) |
వాద్యం: సాని దనిపాప దని(2) పాప పదపమగా
జగమే కళ్యాణ వేదికగా
(నినినీ నీసాస సనిదనిపా గమదని)
సొగసే మందార మాలికగా
(నినినీ నీసాస సనిదనిపా గమదని)
తొలిసిగ్గు చిగురించగా
(దదద దదనీ(2)ద పా...)
నా అలివేణి తలవాల్చి రాగ
(నీ ససనీని దని(2)పామ గరిసాగా)
రెండువందల యాభైకు పైగా జన్యరాగాలున్న ధీరశంకరాభరణంలో, హేమంత్ లాంటి ఔడవ-సంపూర్ణరాగం సంగీత గ్రంథాలలో పేర్కొన్నట్టు కనిపించదు. "రాగ ప్రవాహం" అన్న గ్రంథంలో మాత్రం ఈ "హేమంత్" రాగము పేర్కొనబడినది. ఘంటసాల ఈ రాగస్వరూపాన్ని ఎలా గమనించారో మనకు తెలియదుగాని, స్వరకర్తగా తను సృష్టించిన పాటలలో మాత్రమే ఈ రాగం వికసించి, రహస్యం చిత్రంలో, సలక్షణంగా, స్వర-రాగ-తాళ వైవిధ్యంతో, ఒక ప్రముఖగీతమై, నేటికీ మళ్ళి మళ్ళి వినాలనిపించే పాటవెనుక ఘంటసాల చేసిన నాదకృషి, చూపిన నవ్యస్వరసంయోజన మాధుర్యం, ఆయనకు లలిత సంగీత చరిత్రలో, నవరాగాన్వేషకునిగా, మధురస్వరపోషకునిగా, రసావిష్కార భగీరథునిగా, ఆహ్లాదమనోరథునిగా శాశ్వత స్థానాన్ని కలిగించాయి.
పండిత్ రవిశంకర్ సితారుపై హేమంతరాగం
హేమంత్ రాగాధారితమైన కొన్ని హిందీ పాటలు:
(బల్మా అనారి మున్ భాయే - బహురాణి - లతాజి : 1963)
(సుధ్ బిసర్ గయి ఆజ్ - సంగీత్ సామ్రాట్ తాన్ సేన్ - రఫి, మన్నాడె: 1962)
(తుమ్ బిన్ జీవన్ కైసా జీవన్ - బావర్చి - మన్నాడె -1972)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇంత విపులంగా ఒక రీసెర్చ్ చేసి టపా వ్రాయడం బ్లాగు లోకం లో చాలా అరుదు ! కొంత మంది బ్లాగర్లు మాత్రమె చేయగలరు. (పేషన్ ఉన్నవాళ్ళు ) ;
రిప్లయితొలగించండిచాలా చాలా బాగుంది. ! ఘంటసాల గారి మీద మీ ఈ టపా రియల్లీ సూపర్బ్!
చీర్స్
జిలేబి
ధన్యవాదాలు జిలేబి గారు.
తొలగించండిIts simply superb.. It took lot of time to understand. Great sury garu..
రిప్లయితొలగించండిgreat post sir.
రిప్లయితొలగించండిsandarbhochitamina mee tapaa entho visleshanatmakamga, rasaanubhoothini utkrushta sthaayilo kaliginchedigaa undi. meeku naa shubhaabhinandanalu. meeru ilaage marenno animutyalanu andinchela aa paratpartudu meepai tana krupa karuna kataksha veekshanalu prasarimpa cheyalaani prarthistunnanu.
రిప్లయితొలగించండిanjaneyulu ballamudi
చంద్రమౌళి గారు,
రిప్లయితొలగించండివ్యాసం చాలా చాలా బాగుంది. రాగశాల అనే మీరు చేసే ఈ గొప్ప కార్యంలో నేను చేసింది బహు తక్కువ. సంగీతంలో నాకున్న మిడి మిడి జ్ఞానంతో మీ ఈ గొప్ప పనిలో ఏదో ఉడుతాభక్తి లాంటి పాలు పంచుకోవటం నా అదృష్టంగా భావిస్తాను. ఇంతదానికే నా పేరు అన్నిసార్లు ప్రస్తావించడం మీ మంచితనం. Credit అంతా మీకు, సూర్యనారాయణ గారికి చెందుతుంది.
ఒక చిన్న విషయం. మర్మయోగిలోని పాట మంచి audio quality తో నా దగ్గర ఉంది, మీకు, సూర్యనారాయణ గారికి e-mail చేస్తాను, అది ఈ వ్యాసంలో వాడ గలరు.
రామ ప్రసాద్
వ్యాసాన్ని మళ్ళీ చదువుతుంటే ఈ సారి గుర్తుకు వచ్చింది. ఉదాత్త, అనుదాత్త, స్వరితాలు మరియు నాల్గు స్వరముల ప్రయోగము కూడా భగవద్గీత శ్లోకాల్లో మాస్టారు చేసేరని సంగీత రావు గారు చెప్పేరు. మీరు కూడా వాటిని విశదీకరిస్తే మాలాంటి వాళ్ళకు పరమానందం అవుతుంది.
రిప్లయితొలగించండిరామ ప్రసాద్